సుదీర్ఘకాలం సహజీవనం చేసినంత మాత్రాన ఏ ఇరువురికీ వివాహపరంగా ఎలాంటి న్యాయపరమైన హక్కులు వర్తించవని మద్రాస్ హైకోర్ట్ స్పష్టం చేసింది. దాంపత్య హక్కులు (Conjugal Rights) పొందాలి అంటే ఆ జంట కచ్చితంగా చట్టానికి లోబడి వివాహం చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. సహజీవనానికి సంబంధించిన ఎలాంటి వివాదాలు కుటుంబ న్యాయస్థానం పరిధిలోకి రావని జస్టిస్ వైద్యానాథన్, జస్టిస్ ఆర్ విజయకుమార్‌తో కూడిన ధర్మాసనం తేల్చి చెప్పింది.
తమిళనాడు కోయంబత్తూర్‌కు చెందిన ఆర్కళై సెల్వి అనే మహిళ 2013 నుంచి జోసెఫ్ బేబీ అనే వ్యక్తితో సుదీర్ఘకాలం సహజీవనం చేశారు. తరువాత జోసెఫ్.. సెల్విని వదిలి వెళ్లిపోయారు. దీనిపై ఆమె విడాకులు చట్టంలోని సెక్షన్ 32ను ఉటంకించి.. దాంపత్య హక్కులు కల్పించాలని కోరుతూ కుటుంబ న్యాయస్థానంలో అప్పీలు చేశారు. ఆమె అభ్యర్థనను ఫ్యామిలీ కోర్ట్ 2019 ఫిబ్రవరి 14 న కొట్టివేసింది. దీనిపై ఆమె మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు.