కేరళకు చెందిన 17 ఏళ్ల బాలిక తండ్రి పట్ల ప్రేమను చాటుకుంది. కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న తండ్రికి తన లివర్‌లోని కొంత భాగాన్ని దానం చేసి ఔరా అనిపించుకుంది. ఫిబ్రవరి 9న రాజగిరి ఆస్పత్రిలో శస్త్రచికిత్స నిర్వహించి బాలిక లివర్‌లో కొంత భాగాన్ని ఆమె తండ్రికి అమర్చారు వైద్యులు. దీంతో దేశంలోనే మొదటిసారిగా అవయవదానం చేసిన తొలి మైనర్‌గా రికార్డు సృష్టించింది దేవానంద.
ఇదీ అసలు కథ..
త్రిస్సూర్‌లోని కొలాజీకి చెందిన ప్రతీశ్(48) గత కొన్నేళ్లుగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. అవయవ మార్పిడి చేయకపోతే ప్రతీశ్ ఇంకెన్నో రోజులు బతకడని వైద్యులు చెప్పారు. కాలేయాన్ని దానం చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో ప్రతీశ్ కుమార్తె దేవానంద(17) తన తండ్రికి లివర్‌ను దానం చేసేందుకు సిద్ధమైంది. అయితే సర్జరీకి వైద్యులు ఇచ్చిన గడువు దగ్గర పడడం వల్ల ప్రతీశ్ కుమార్తె దేవానంద తన కాలేయాన్ని ఇస్తానని వైద్యులకు తెలిపింది. దేవానంద మైనర్ కావడం వల్ల చట్టం అందుకు అంగీకరించదని వైద్యులు స్పష్టం చేశారు. దీంతో చేసేదేమీలేక దేవానంద.. కేరళ హైకోర్టును ఆశ్రయించింది.
తండ్రిని బతికించుకోవడం కోసం తన కాలేయాన్ని దానం చేసేందుకు అనుమతివ్వాలని కేరళ హైకోర్టును కోరింది. ట్రాన్స్‌ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గాన్ యాక్ట్ 1994 ప్రకారం.. వైద్య నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది కోర్టు. అవయవదానం చేసినా బాలిక ప్రాణానికి ఎటువంటి ప్రమాదం ఉండదని నిపుణులు ఇచ్చిన నివేదికను పరిగణనలోకి తీసుకుంది కోర్టు. దేవానంద తన తండ్రికి కాలేయం దానం చేసేందుకు అనుమతిచ్చారు జస్టిస్ వీజీ అరుణ్.