బంగాల్, అసోం అసెంబ్లీ రెండో విడత ఎన్నికలు ముగిశాయి. సాయంత్రం ఆరు గంటల నాటికి బంగాల్లో 80.43 శాతం ఓటింగ్ నమోదైంది.
అదేసమయంలో, అసోంలో 73.03 శాతం పోలింగ్ రికార్డైనట్లు భారత ఎన్నికల సంఘం వెల్లడించింది.
18:15 April 01
బంగాల్, అసోం అసెంబ్లీ రెండో విడత ఎన్నికలు ముగిశాయి. సాయంత్రం ఆరు గంటల నాటికి బంగాల్లో 80.43 శాతం ఓటింగ్ నమోదైంది.
అదేసమయంలో, అసోంలో 73.03 శాతం పోలింగ్ రికార్డైనట్లు భారత ఎన్నికల సంఘం వెల్లడించింది.
15:37 April 01
జోరుగా పోలింగ్..
మధ్యాహ్నం 3.30 గంటల వరకు బంగాల్లో 71 శాతం పోలింగ్ నమోదైందని ఎన్నికల సంఘం ప్రకటించింది. అసోంలో 63 శాతానికిపైగా ఓటు హక్కు వినియోగించుకున్నారని వెల్లడించింది.
14:47 April 01
కోర్టుకెళ్తాం: దీదీ
రెండో విడత ఎన్నికలకు సంబంధించి ఈసీకి ఇప్పటివరకు 63 ఫిర్యాదులు చేసినట్లు టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన గూండాలు బంగాల్లో విధ్వంసం సృష్టిస్తున్నారని ఆరోపించారు. ఈసీ చర్యలు తీసుకోకపోతే కోర్టుకు వెళ్తామని హెచ్చరించారు.
14:41 April 01
'వారంతా బయటివారు'
టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ నందిగ్రామ్‌లోని ఓ పోలింగ్ బూత్‌ను సందర్శించారు. ఓటింగ్ సరళిని పరిశీలించారు.
ఈ సందర్భంగా నినాదాలు చేసినవారిపై మండిపడ్డారు మమత. వారంతా బయటి వ్యక్తులని ధ్వజమెత్తారు. బిహార్, ఉత్తర్‌ప్రదేశ్ నుంచి వచ్చిన వారందరిని కేంద్ర బలగాలు రక్షిస్తున్నాయని ఆరోపించారు.
13:08 April 01
బంగాల్లో 58 శాతం పోలింగ్..
బంగాల్, అసోంలో రెండో దశ పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం ఒంటిగంట వరకు బంగాల్లో 58 శాతం, అసోంలో 48.26 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది.
12:05 April 01
బంగాల్లో 37శాతం..
ఉదయం 11:31 గంటల వరకు బంగాల్లో 37.4శాతం పోలింగ్ నమోదైంది. కొన్ని ప్రాంతాల్లో చెదురుమొదురు ఘటనలు జరిగినప్పటికీ.. మిగిలిన ప్రాంతాల్లో పోలింగ్ సాఫీగా సాగుతోంది.
11:47 April 01
పోలీసుల అదుపులో...
బంగాల్ డెబ్రాలో భాజపా నేత మోహన్ సింగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రెండో దశ పోలింగ్ జరుగుతుండగా.. నియోజకవర్గంలోని ఓ పోలింగ్ బూత్‌కు సమీపంగా(100మీటర్ల) ఆయన వెళ్లిన కారణంగా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
అయితే ఆ నియోజకవర్గం భాజపా అభ్యర్థి భారతి ఘోష్ పిలవడం వల్లే తాను అక్కడికి వెళ్లినట్టు మోహన్ వెల్లడించారు.
మోహన్‌ను పోలీసులు తీసుకెళుతున్న సమయంలో భాజపా కార్యకర్తలు ఆందోళనకు దిగారు.
11:20 April 01
ఉదయం 11గంటల వరకు..
ఉదయం 11:17 గంటల వరకు అసోంలో 21.71శాతం, బంగాల్లో 29.27శాతం పోలింగ్ నమోదైంది. ఈ విషయాన్ని ఎన్నికల సంఘం వెల్లడించింది.
10:47 April 01
కేశ్పుర్లో...
కేశ్పుర్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బూత్ నెం. 173 వద్ద భాజపా పోలింగ్ ఏజెంట్‌ను కేంద్రానికి వెళ్లనివ్వకుండా టీఎంసీ కార్యకర్తలు అడ్డుపడ్డారు. ఈ నేపథ్యంలో.. స్థానిక భాజపా నేత తన్మయ్ ఘోష్ వాహనాన్ని పలువురు ధ్వంసం చేశారు. స్వేచ్ఛాయుత పోలింగ్‌కు టీఎంసీ అడ్డుపడుతోందని భాజపా ఆరోపించింది.
10:25 April 01
ఆందోళనలు..
బంగాల్లోని ఘాటల్ వద్ద సీపీఎం కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఓటు వేసేందుకు వెళుతుంటే.. టీఎంసీ కార్యకర్తలు తమను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఈ క్రమంలో టైర్లను తగలబెట్టారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితులను అదుపుచేశారు.
10:22 April 01
అజ్మల్ ఓటు..
అసోంలోని హౌజైలో.. ఆల్ ఇండియా యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ అధ్యక్షుడు బాద్రుద్దిన్ అజ్మల్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
09:56 April 01
భాజపా కార్యకర్త మృతి..
నందిగ్రామ్ పూర్వ భేకుతియాలో ఉరికి వేలాడుతూ ఓ భాజపా కార్యకర్త మృతదేహం లభించింది. టీఎంసీ కార్యకర్తలే హత్యచేశారని అతడి కుటుంబసభ్యులు ఆరోపించారు.
09:33 April 01
ఉదయం 9గంటల వరకు...
ఉదయం 9గంటల వరకు అసోంలో 10.51శాతం, బంగాల్లో 13.14శాతం పోలింగ్ నమోదైంది.
08:36 April 01
'టీఎంసీ...'
డెబ్రా నియోజకవర్గంలో భాజపా అభ్యర్థి భారతి ఘోష్.. టీఎంసీపై తీవ్ర ఆరోపణలు చేశారు. తన ఎన్నికల ఏజెంట్ పోలింగ్ బూత్‌కు రానివ్వకుండా.. 150 టీఎంసీ గూండాలు చుట్టుముట్టినట్టు వెల్లడించారు. బరూనియాలో టీఎంసీ కార్యకర్తలు ఓటర్లను భయపెడుతున్నారని పేర్కొన్నారు.
08:09 April 01
నందిగ్రామ్‌లో సువేందు అధికారి..
బంగాల్ నందిగ్రామ్ నియోజకవర్గంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు భాజపా అభ్యర్థి సువేందు అధికారి. నందనాయకర్ ప్రాథమిక పాఠశాల పోలింగ్ బూత్ నెం. 76 లో ఓటు వేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. పెద్ద సంఖ్యలో ప్రజలు ఓటు వేసేందుకు రావాలని కోరారు. దేశమంతా నందిగ్రామ్ నియోజకవర్గం వైపే చూస్తోందని పేర్కొన్నారు. అభివృద్ధి కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని అన్నారు.
07:31 April 01
ప్రధాని ట్వీట్..
రెండో విడత పోలింగ్ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. అసోంలో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. బంగాల్ ప్రజలు రికార్డు స్థాయిలో ఓట్లు వేయాలని కోరారు.
07:22 April 01
నందిగ్రామ్‌లో..
నందిగ్రామ్వాసులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు తరలివెళుతున్నారు. పోలింగ్ మొదలైన కాసేపటికే.. పోలింగ్ కేంద్రాల వద్ద బారులుతీరారు ఓటర్లు. యువకుల నుంచి వృద్ధుల వరకు క్యూలో నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
నందిగ్రామ్ నుంచి బరిలో దిగిన నాటి మిత్రులు-నేటి శత్రువులు మమతా బెనర్జీ-సువేందు అధికారి పోరులో ప్రజలు ఎవరిని గెలిపిస్తారనేది సర్వత్రా ఆసక్తిగా మారింది.
06:53 April 01
పోలింగ్ ప్రారంభం...
బంగాల్, అసోంలో.. రెండో విడత పోలింగ్ ప్రారంభమైంది. ఓటు వేసేందుకు ఇప్పటికే పలు కేంద్రాల్లో ప్రజలు బారులు తీరారు. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్.. సాయంత్రం 6 గంటల వరకు సాగనుంది.
కొవిడ్ నిబంధనలు- పటిష్ఠ భద్రతా ఏర్పాట్ల మధ్య రెండో దశ పోలింగ్ సాగనుంది. ఇందుకోసం అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేశారు.
06:42 April 01
నందిగ్రామ్‌లో తుది ఏర్పాట్లలో అధికారులు
బంగాల్, అసోంలో చివరి నిమిషం వరకు పోలింగ్ ఏర్పాట్లు జరుగుతున్నాయి. బంగాల్ నందిగ్రామ్ నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రంలో అధికారులు.. ఏర్పాట్లను ముమ్మరం చేశారు.
అసోంలోని పలు కేంద్రాల్లో ప్రజలు ఇప్పటికే పోలింగ్ కేంద్రాలకు చేరుకుని ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఎదురుచూస్తున్నారు.
06:23 April 01
పోలింగ్ లైవ్ అప్డేట్స్
బంగాల్, అసోంలో.. రెండో విడత పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. అసోంలో 39, బంగాల్లో 30 అసెంబ్లీ స్థానాలకు ఉదయం 7 గంటల నుంచి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది.
అసోంలో మొత్తం 126 నియోజకవర్గాలు ఉండగా మూడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. 47 స్థానాలకు గత నెల 27న తొలివిడత ఓటింగ్ జరిగింది.
బంగాల్లో 8 విడతల సుదీర్ఘ ఎన్నికల ప్రక్రియలో భాగంగా తొలి దశలో 30 స్థానాల్లో పోలింగ్ గత నెల 27న జరగింది. తాజాగా జరగనున్న పోలింగ్‌లో అందరి దృష్టి నందిగ్రామ్ నియోజకవర్గంపైనే ఉంది. సీఎం మమతా బెనర్జీ- భాజపా నేత సువేందు అధికారి ఈ నియోజకవర్గం నుంచి బరిలో దిగడం ఇందుకు కారణం.