Live In Relationship Allahabad High Court : భారత్‌లోని వివాహ వ్యవస్థను ధ్వంసం చేసేలా సహజీవన వ్యవస్థ పని చేస్తోందని అలహాబాద్ హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. సహజీవన సంబంధాలపై ఘాటు వ్యాఖ్యలు చేసింది. అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ సహజీవన భాగస్వామికి బెయిల్ మంజూరు చేసిన కేసులో హైకోర్టు వ్యాఖ్యానించింది.
కేసు ఏంటంటే?
Live In Relationship Allahabad HC :ఏడాది పాటు సహజీవనంచేస్తున్న ఓ యువకుడు.. తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన 19 ఏళ్ల యువతి కేసు పెట్టింది. తాను గర్భవతినని, తన భాగస్వామి పెళ్లికి అంగీకరించడం లేదని ఫిర్యాదులో పేర్కొంది. యువతి కేసుపై శుక్రవారం విచారణ జరిపిన అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సిద్ధార్థ్.. నిందితుడికి బెయిల్ మంజూరు చేశారు. దాంతో పాటు సహజీవన సంబంధాలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.
"ఒక వ్యక్తికి వివాహ వ్యవస్థ అందించే సామాజిక భద్రత, అంగీకారం, స్థిరత్వం.. ఈ సహజీవన సంబంధాలు అందించవు. ప్రతి సీజన్‌లో భాగస్వామిని మార్చే ఈ క్రూరమైన భావన ఒక స్థిరమైన, ఆరోగ్యవంతమైన సమాజానికి లక్షణంగా పరిగణించలేం. వివాహ వ్యవస్థ కనుమరుగైన తర్వాతే మన దగ్గర ఈ బంధం సాధారణమవుతుంది. వివాహ వ్యవస్థలో భాగస్వామితో నిజాయతీగా లేకపోవడం, సహజీవన సంబంధాలను కలిగి ఉండటం ప్రగతిశీల సమాజానికి సూచనలుగా చెలామణి అవుతున్నాయి. అలాంటి ధోరణికి యువత ఆకర్షితులు కావడం క్రమక్రమంగా పెరుగుతోంది. ఈ తీరుతో దీర్ఘకాలంలో జరిగిన పరిణామాల పట్ల అవగాహన లేకపోవడమే అందుకు కారణం."
- సహజీవన సంబంధాలపై అలహాబాద్ హైకోర్టు