తౌక్టే తుపాను సృష్టించిన అల్లకల్లోలంలో 'పీ-305' నౌక ఒకటి. ఓఎన్జీసీ స్థావరానికి సమీపంలోని పీ-305తో పాటు మరో మూడు నౌకలు గల్లంతైన వార్త కలకలం సృష్టించింది. చివరకు నౌకాదళం ఆపరేషన్‌తో వాటిని గుర్తించి, సహాయక చర్యలు చేపట్టారు. ఈ మొత్తం వ్యవహారంలో 49మంది ప్రాణాలు కోల్పోగా, మరో 37మంది ఆచూకీ ఇప్పటికీ లభించలేదు.
నిత్యం అప్రమత్తంగా ఉండే నౌక ప్రమాదానికి ఎందుకు గురైంది? దీని వెనుక కారణాలేంటి?
లెక్కలు తప్పాయి..!
తౌక్టే తుపాను ధాటికి సోమవారం రాత్రి పీ-305తో పాటు మరో మూడు నౌకలు గల్లంతయ్యాయి. వీటిల్లోని వారిని రక్షించేందుకు ప్రత్యేక ఆపరేషన్‌ను నిర్వహించింది భారత నౌకాదళం. 261మందిలో 186మందిని కాపాడింది.
అయితే ఇలాంటి నౌకల్లో సిబ్బంది చేసే పని సాహసోపేతమైనది. సముద్రంలో ఎప్పుడు ఎలాంటి ఇబ్బందులు వస్తాయో తెలియదు. అందువల్ల సిబ్బంది నిత్యం అప్రమత్తంగా ఉంటారు. కానీ తౌక్టే విషయంలో అన్ని లెక్కలు తప్పడం వల్లే పీ-305కి అలాంటి పరిస్థితి ఎదురైందని తెలుస్తోంది.
"ప్రతికూల వాతావరణంలోనూ పని చేసే విధంగా ఏర్పాట్లు ఉంటాయి. పని ఆగదు. ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడల్లా సిబ్బందిని తరలిస్తారు. ప్రపంచంలో ఎక్కడా ఇది జరగదు. పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని, అదుపు చేయడం కష్టమని తెలిస్తేనే సిబ్బందిని తరలిస్తారు. రెండు దశాబ్దాల్లో.. పశ్చిమ తీరాన్ని తాకిన అతి పెద్ద తుపాను తౌక్టే. కానీ వేసుకున్న లెక్కలన్నీ తప్పాయి. తుపాను వేగం, వాతావరణ పీడనం, తుపాను ప్రయాణిస్తున్న మార్గం గురించి వివరాలు సరిగ్గా అందలేదు. కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేసి, సిబ్బంది, ఓడను తరలించాలంటే వారం రోజులు పడుతుంది. తౌక్టే విషయంలో సరిపడా సమయం దొరకలేదు."
--అధికారి.
అయితే ఇలాంటి పరిస్థితుల్లో తుది నిర్ణయం తీసుకోవాల్సింది ఓడలోని కెప్టెన్లు అని మరో అధికారి తెలిపారు. ఈ సందర్భంలో వారు కీలక నిర్ణయం ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. దీనిపై దర్యాప్తు బృందాన్ని ఇప్పటికే ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు.
ఇదీ చూడండి:-గుజరాత్లో 'తౌక్టే' ధాటికి 53 మంది మృతి