తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆ రాష్ట్రంలో భారీగా లిథియం నిక్షేపాలు.. కశ్మీర్​ కంటే అధికం!

దేశంలో లిథియం నిక్షేపాలు మరోసారి భారీగా బయటపడ్డాయి. రాజస్థాన్​లో ఈ నిల్వలను గుర్తించినట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు వెల్లడించినట్లు కథనాలు వెలువడుతున్నాయి.

lithium reserves Rajasthan
lithium reserves Rajasthan

By

Published : May 8, 2023, 10:56 PM IST

దేశంలో మరోసారి భారీగా లిథియం నిక్షేపాలు బయటపడ్డాయి. రాజస్థాన్‌.. నాగౌర్‌ జిల్లా డెగానా మున్సిపాలిటీ పరిధిలో ఈ నిల్వలను గుర్తించినట్లు రాజస్థాన్‌ ప్రభుత్వ అధికారులు, జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియాకు చెందిన అధికారులు వెల్లడించినట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో జమ్ముకశ్మీర్‌లో గుర్తించిన 59 లక్షల టన్నుల లిథియం నిల్వల కంటే ఇక్కడ అధికంగా ఉన్నట్లు చెబుతున్నారు. 80 శాతం వరకు దేశీయ అవసరాలను ఈ నిల్వలు తీర్చగలవని పేర్కొంటున్నారు.

జమ్ముకశ్మీర్​లో తొలిసారిగా..
ఈ ఏడాది ఫిబ్రవరిలో జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా తొలిసారి దేశంలో లిథియం నిల్వలు కనుగొంది. కేంద్రపాలిత ప్రాంతమైన జమ్ముకశ్మీర్‌.. రియాసి జిల్లాలోని సలాల్‌ హైమాన ప్రాంతంలో 59 లక్షల టన్నుల లిథియం రిజర్వ్‌లు ఉన్నట్లు కేంద్ర గనుల శాఖ ప్రకటించింది.

దేశ వ్యాప్తంగా గనుల శాఖ మొత్తం 51 ఖనిజ క్షేత్రాలను గుర్తించింది. వాటిని గనుల శాఖ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించింది. వీటిల్లో మొత్తం 5 క్షేత్రాల్లో బంగారం నిల్వలను కనుగొన్నారు. మిగిలిన చోట్ల పొటాష్‌, మాలిబ్డినం, ఇతర ప్రాథమిక లోహాలను గుర్తించారు. జమ్ముకశ్మీర్‌, ఆంధ్రప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, గుజరాత్‌, ఝార్ఖండ్‌, కర్ణాటక, మధ్యప్రదేశ్‌, ఒడిశా, రాజస్థాన్‌, తమిళనాడు, తెలంగాణ ప్రాంతాల్లో ఇవి ఉన్నాయి. 2018-19 మధ్య నిర్వహించిన సర్వేల ఆధారంగా గుర్తించారు. వీటిల్లో 17 చోట్ల 7,897 మిలియన్‌ టన్నుల బొగ్గు, లిగ్నైట్‌ ఉన్న గనులను కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖకు అప్పగించింది.

ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీల తయారీలో లిథియం నుంచి వినియోగిస్తారు. ప్రభుత్వం గత కొన్నేళ్లుగా దేశీయంగా విద్యుత్తు వాహనాల తయారీని ప్రోత్సహిస్తోంది. ఈవీల ధరలు తక్కువగా ఉండటానికి పలు పన్ను ప్రోత్సాహకాలను కూడా ప్రకటించింది. ప్రస్తుతం భారత్‌ లిథియం, నికెల్‌, కోబాల్ట్‌ వంటి లోహాలను దిగుమతి చేసుకుంటోంది. జమ్ముకశ్మీర్‌లో లిథియం నిల్వలు కనుగొనడం వల్ల భవిష్యత్తులో విద్యుత్తు వాహన తయారీ రంగానికి మరింత బలం చేకూరనుంది. భవిష్యత్తులో ఈ ఖనిజాల దిగుమతులు తగ్గి బ్యాటరీ ధరలు దిగిరానున్నాయి.

లిథియం స్పెషల్స్ ఇవే..
ఐదేళ్ల క్రితం రసాయన శాస్త్రంలో నోబెల్‌ ప్రైజ్​ అందుకున్న జపాన్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ అకిరా యోషినో మొట్టమొదటిసారిగా 1980ల్లో లిథియం అయాన్‌ బ్యాటరీలను తయారుచేశారు. రసాయన శక్తిని విద్యుత్‌ శక్తిగా మార్చే గుణం లిథియంకి ఉంది. కొత్తలో పెద్దసైజులో తయారైన మొబైల్‌ ఫోను ఇప్పుడు చేతిలో ఇమిడేలా చిన్నగా వచ్చిందంటే అది లిథియంతో తయారైన బ్యాటరీల చలవే. కారుకి లెడ్‌ యాసిడ్‌ బ్యాటరీ వాడితే అది 4,000 కిలోల బరువు ఉంటుంది. అదే లిథియం బ్యాటరీ అయితే 600 కిలోలే. అంత తేడా ఉంది కాబట్టే ఈ లోహానికి ఒక్కసారిగా బోలెడు ప్రాధాన్యం లభించింది. ఇప్పుడదే మొత్తంగా ప్రపంచాన్ని తన చుట్టూ తిప్పుకుంటోంది.

ABOUT THE AUTHOR

...view details