భారత్‌లో కరోనా రెండో దశ ఉద్ధృతి ప్రమాదకరస్థాయిలో కొనసాగుతోంది. మొదటి దశ కంటే.. రెండో దశలో కేసులు భారీగా నమోదవుతుండటంతో ఆయా రాష్ట్రాలు ఆంక్షలు, లాక్‌డౌన్ల దిశగా కదులుతున్నాయి. కఠిన చర్యలు చేపడుతూ వైరస్‌కు అడ్డుకట్ట వేసే ప్రయత్నాలు చేస్తున్నాయి.
తాజాగా హరియాణాలో కేసుల సంఖ్య భారీగా పెరగడంతో సోమవారం నుంచి రాత్రి కర్ఫ్యూని ఆ రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. ఇక భోపాల్‌లో ఏడు రోజుల రాత్రి కర్ఫ్యూకి మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఆదేశించింది. సోమవారం నుంచి ఏప్రిల్ 19 వరకూ ఇది అమల్లో ఉండనుంది.
దేశవ్యాప్తంగా ఆంక్షలు అమలవుతున్న రాష్ట్రాలివే..
మహారాష్ట్ర
దేశంలో కొవిడ్‌కు ఎక్కువ ప్రభావితమైన రాష్ట్రం మహారాష్ట్రనే. దేశవ్యాప్తంగా నమోదువుతున్న కేసులు, మరణాల్లో దాదాపు సగం ఇక్కడి నుంచే ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో లాక్‌డౌన్ తరహా కఠిన ఆంక్షలు విధిస్తున్నట్లు ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే వెల్లడించారు. కొవిడ్ తీవ్రత దృష్ట్యా ఈ నెల 14 రాత్రి 8 గంటల నుంచి.. మే 1 ఉదయం 7 గంటల వరకు 15రోజుల పాటు 144 సెక్షన్ విధిస్తున్నట్లు సీఎం ప్రకటించారు. మహారాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు, ప్రార్థనా మందిరాలు, థియేటర్లు, పార్కులు, జిమ్‌లు మూసేస్తున్నామని వెల్లడించారు.
ఆంక్షల నేపథ్యంలో పేదలకు 3 కిలోల గోధుమలు, 2 కిలోల బియ్యం పంపిణీ చేస్తామని... ఆటో డ్రైవర్లు, వీధి వ్యాపారులకు 15 వందల రూపాయల ఆర్థిక సాయం అందిస్తామని ఉద్ధవ్ ఠాక్రే వెల్లడించారు.