తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఈ ఏడాది 77 మంది రాజ్యసభ సభ్యుల పదవీ విరమణ - రాజ్యసభ వార్తలు

Rajya Sabha members retiring in 2022: 2022లో రాజ్యసభ సభ్యులు మొత్తం 77 మంది పదవీ విరమణ చేయనున్నట్లు తెలిపింది రాజ్యసభ సచివాలయం. ఇందులో ఆంధ్రప్రదేశ్​ నుంచి నలుగురు, తెలంగాణ నుంచి ఇద్దరు ఎంపీలు ఉన్నారు. కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్​, ముక్తార్​ అబ్బాస్​ నఖ్వీ, పీయూష్​ గోయల్​ వంటి ప్రముఖుల పదవీ కాలం సైతం ఈఏడాదే ముగియనుంది.

Parliament
పార్లమెంట్​

By

Published : Jan 6, 2022, 6:48 AM IST

Rajya Sabha members retiring in 2022: ఈ ఏడాది మొత్తం 77 మంది రాజ్యసభ సభ్యులు పదవీ విరమణ చేయనున్నారు. అందులో ఆంధ్రప్రదేశ్​ నుంచి నలుగురు, తెలంగాణ నుంచి ఇద్దరు ఉన్నారు. ఆ వివరాలను బుధవారం రాజ్యసభ సచివాలయం వెల్లడించింది. జూన్‌ 21 నాటికి ఆంధ్రప్రదేశ్‌ నుంచి సురేష్‌ ప్రభు, సుజనా చౌదరి, టీజీ వెంకటేశ్‌, విజయసాయిరెడ్డి, తెలంగాణ నుంచి లక్ష్మీకాంతరావు, డి.శ్రీనివాస్‌ల పదవీకాలం ముగియనుంది.

ప్రస్తుతం ఉన్న సంఖ్యాబలం ప్రకారం ఈ స్థానాలన్నీ రెండు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న వైకాపా, తెరాసలకే దక్కనున్నాయి. ఏపీ నుంచి విజయసాయిరెడ్డి యథాతథంగా కొనసాగే సూచనలున్నాయి. మరో మూడు స్థానాల్లో కొత్తవారు రానున్నారు. తెరాసకు దూరంగా ఉన్న దృష్ట్యా తెలంగాణలో డి.శ్రీనివాస్‌ను కొనసాగించే అవకాశం ఉండకపోవచ్చు. వయసురీత్యా లక్ష్మీకాంతరావుకు తెరాస మళ్లీ అవకాశం ఇవ్వకపోవచ్చు. ఇప్పుడున్న సంఖ్యాబలం ప్రకారం రాజ్యసభలో భాజపాకు 97, కాంగ్రెస్‌కు 34 మంది సభ్యుల బలం ఉంది. భాజపా అర డజను సీట్లు అటూ ఇటుగా తన బలాన్ని నిలబెట్టుకునే అవకాశం కనిపిస్తోంది. కాంగ్రెస్‌దీ ఇదే పరిస్థితి. ప్రాంతీయ పార్టీల్లో డీఎంకే, వైకాపా బలం పెరగనుంది.

జాబితాలో నిర్మలా సీతారామన్‌, నఖ్వీ

ఇతర రాష్ట్రాల నుంచి పదవీ విరమణ చేసే ప్రముఖుల్లో కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్‌ (కర్ణాటక), ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ (ఝార్ఖండ్‌), పీయూష్‌ గోయల్‌ (మహారాష్ట్ర), కాంగ్రెస్‌ నుంచి ఆనంద్‌ శర్మ (హిమాచల్‌ప్రదేశ్‌), జైరాం రమేశ్‌ (కర్ణాటక), ఏకే ఆంటోనీ (కేరళ), పి.చిదంబరం (మహారాష్ట్ర), అంబికా సోనీ (పంజాబ్‌), కపిల్‌ సిబల్‌ (ఉత్తర్‌ప్రదేశ్‌) ఉన్నారు. ఇందులో కేంద్ర మంత్రులు మళ్లీ ఏదో ఒక రాష్ట్రం నుంచి ఎన్నికవడం ఖాయంగానే కనిపిస్తోంది. కాంగ్రెస్‌ నేతల్లో ఒకరిద్దరు మినహాయించి మిగిలిన వారంతా పెద్దల సభలో అడుగుపెట్టడానికి అవకాశాలున్నాయి.

ఈసారి ఉత్తర్‌ప్రదేశ్‌లో శాసనసభ ఎన్నికలు జరిగిన అనంతరం కొత్త రాజ్యసభ సభ్యుల ఎంపిక జరిగే అవకాశం ఉంది. అందులో పార్టీలు గెలుచుకునే అసెంబ్లీ సీట్ల ఆధారంగా ప్రస్తుతం పదవీ విరమణ చేసే 11 సీట్లలో ఏ పార్టీకి ఎన్ని దక్కుతాయన్నది తెలుస్తుంది. ఝార్ఖండ్‌, మహారాష్ట్ర, రాజస్థాన్‌లలోనూ భాజపాకు ఇదివరికంటే సీట్లు తగ్గే అవకాశాలున్నాయి. సీపీఎం కేరళలో బలాన్ని పెంచుకుని, త్రిపురలోని సీటును కోల్పోనుంది. పంజాబ్‌, ఉత్తరాఖండ్‌లలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నందున అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను బట్టి అక్కడ ఈ సీట్లు తారుమారయ్యే అవకాశం ఉంటుంది.

ఇదీ చూడండి:ఎన్నికల రాజకీయాన్ని మార్చిన కరోనా- యూపీ కోసం ఇక డిజిటల్ యుద్ధమే!

భాజపా వాట్సాప్​ గ్రూప్స్​కు కేంద్రమంత్రి గుడ్​బై.. పార్టీకి కూడా?

ABOUT THE AUTHOR

...view details