Delhi Liquor Scam Accused Sarath Chandra Reddy in TTD Board: తిరుమల తిరుపతి దేవస్థానం అంటే పవిత్రతకు మారుపేరు. అలాంటి పవిత్ర సంస్థ పాలకమండలిలో సభ్యులుగా లిక్కర్ కేసులో అరెస్టయి, అప్రూవర్‌గా మారిన పెనక శరత్ చంద్రారెడ్డికి వైసీపీ ప్రభుత్వం చోటు కల్పించింది. వైసీపీలో దాదాపు నంబర్ 2గా, ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేతగా చక్రం తిప్పుతున్న విజయసాయిరెడ్డి అల్లుడి అన్న కావడమే ఇందుకు ప్రధాన కారణం. బెంగళూరులో సీఎం జగన్ ఇల్లున్న యలహంక ప్రాంత ఎమ్మెల్యే ఎస్‌ఆర్ విశ్వనాథ్‌రెడ్డిని సభ్యుడిగా మరోమారు కొనసాగించింది.
వైసీపీ అధికారంలోకి రాగానే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ పూర్తిగా శరత్‌చంద్రారెడ్డి చేతుల్లోకి వచ్చిందంటే అది విజయసాయి రెడ్డి ప్రభావమే. శరత్ చంద్రారెడ్డి వ్యాపార సంస్థ అయిన అరబిందోకు రాష్ట్రంలో పలు ప్రాజెక్టులు సైతం దక్కాయి. తితిదే ఛైర్మన్, ఈవో సహా తిరుమల తిరుపతిల్లోని కీలక పదవులను ఒక ప్రధాన సామాజికవర్గానికి ప్రభుత్వం కట్టబెట్టింది. తాజాగా తితిదే పాలకమండలిలోని 24 మంది సభ్యులలో అయిదుగురు ఆ సామాజికవర్గానికి చెందిన వారే.
TTD New Governing Council: తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులను ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం
మంత్రిమండలిలోకి తీసుకోలేకపోయిన ఎమ్మెల్యేలు పొన్నాడ వెంకట సతీష్‌కుమార్, సామినేని ఉదయభాను, ఎం.తిప్పేస్వామిలకు, వచ్చే ఎన్నికల్లో టికెట్ ఆశిస్తున్నవారిలో మేకా శేషుబాబు, గాదిరాజు వెంకట సుబ్బరాజు, మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు కుమారుడు వీర వెంకట సుధీర్కుమార్లకు తితిదే బోర్డు సభ్యుల పదవులు దక్కాయి. తితిదే ఛైర్మన్ పదవి కోసం శిద్ధా రాఘవరావు ప్రయత్నించారు. అది ఇవ్వలేకపోతే తన కుమారుడికి రాబోయే ఎన్నికల్లో టికెట్ ఇవ్వాలని ముఖ్యమంత్రిని కలిసి కోరారు. ఈ నేపథ్యంలో సుధీర్‌కు బోర్డు సభ్యత్వం ఇచ్చారు.