Lion Cub Varsha: పుట్టుకతోనే తల్లి వదిలేసింది. రెండు రోజులకే తోడబుట్టిన ఇద్దరినీ కోల్పోయింది. తల్లిపాల కోసం విలవిల్లాడింది. మాతృ ప్రేమకోసం తపించింది. ఈ క్రమంలో ఒంటరైన చిట్టి సింహం వర్షకు కొత్త జీవితాన్ని ఇచ్చాడు ఓ జంతు సంరక్షకుడు. సమయానికి పాలు పడుతూ, పోషకాహారం అందిస్తూ సొంత బిడ్డలా చూసుకుంటున్నాడు.
అనాథైన వర్ష..
ఒడిశా భువనేశ్వర్‌లోని నందన్కణన్ జూపార్కులో ఆడ సింహం బిజిలీ, మగసింహం సామ్రాట్ల మూడో సంతానమే వర్ష. పుట్టుకతోనే ఒకటి మృతిచెందగా రెండు రోజులకు మరోటి ప్రాణాలు కోల్పోయింది. ఈ క్రమంలోనే బిజిలీ చిట్టి సింహాన్ని కూడా వదిలి వెళ్లిపోయింది. దీంతో వర్షకు సరైన పౌష్టికాహారం అందించి మనుషుల సంరక్షణలోనే పెంచాలని భావించింది జూపార్కు యాజమాన్యం. పెట్లాక్ అనే మిల్క్ పౌడర్‌ను కోల్‌కతా నుంచి తెప్పించి అందిస్తోంది.