Lingamaneni House Issue: లింగమనేని ఇంటి జప్తుపై వెంటనే నిర్ణయం తీసుకోలేం: అనిశా కోర్టు - lingamaneni ramesh house confiscation case
17:22 June 06
జప్తు కోరిన అధికారిని కూడా విచారించాల్సి ఉందన్న అనిశా కోర్టు
ACB Court on Lingamaneni Ramesh: ఉండవల్లి కరకట్ట వద్ద ఉన్న లింగమనేని రమేష్ ఇంటిని జప్తు చేయడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ ఏపీ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్‌పై ఏసీబీ కోర్టు విచారణ చేపట్టింది. ఈ దశలో నిర్ణయం తీసుకోలేమని ఏసీబీ కోర్టు స్పష్టం చేసింది. అటాచ్‌మెంట్‌కు అనుమతించాలంటే ప్రాథమిక ఆధారాలు ఉన్నాయా? లేదా? అనే విషయాన్ని జప్తు కోసం అభ్యర్థించిన అధికారిని తాము విచారించాల్సిన అవసరముందని చెప్పింది. మే 18న నోటీసు జారీ చేసినందున లింగమనేని రమేష్‌కు కేసు దస్త్రాలు ఇవ్వాలని సీఐడీని ఏసీబీ కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ ఈనెల 16కు వాయిదా వేసింది. అటాచ్మెంట్ వ్యవహారంలో విచారణ జరిపే అధికారం ఏసీబీ కోర్టుకు ఉందని న్యాయమూర్తి తేల్చి చెప్పారు. ఈ పిటిషన్‌పై జూన్ 2న వాదనలు విన్న అనిశా కోర్టు.. నేటికి తీర్పును వాయిదా వేసింది.
వాదనలు ఇలా:మే 17న తమకు డాక్యుమెంట్స్ ఇవ్వాలని ఏసీబీ కోర్టు నోటీసులు జారీ చేసిందని.. అయితే ఇప్పటి వరకు ఎటువంటి డాక్యుమెంట్స్ ఇవ్వలేదని లింగమనేని తరపు న్యాయవాది అశ్విన్ కుమార్ వాదనలు వినిపించారు. ఈ కేసులో తమ వాదనలు వినాలని కోర్టును కోరారు. క్రిమినల్ లా సవరణ ఆర్డినెన్స్-1944 కి వ్యాలిడిటీ ఉందో లేదో నిరూపించుకోవాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉందన్నారు. గతంలోనే ఈ కేసులో హైకోర్టు నుంచి లింగమనేని రమేష్ ముందస్తు బెయిల్ పొందారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. మరోవైపు సీఐడీ తరపున ప్రత్యేక పీపీ వివేకానంద వాదనలు వినిపించారు. అనుమతించడం లేదా తిరస్కరించడంపై ఏదో ఒక విధమైన నిర్ణయం వెల్లడించాకే ప్రతివాదులకు నోటీసు ఇచ్చే ప్రశ్న ఉత్పన్నమవుతుందని తెలిపారు.
ఇదీ జరిగింది: గుంటూరు జిల్లా ఉండవల్లిలోని కరకట్ట రోడ్డు సమీపంలో ఉన్న లింగమనేని రమేష్‌కు చెందిన ఇంట్లో కొన్ని సంవత్సరాలుగా టీడీపీ అధినేత చంద్రబాబు అద్దెకు ఉంటున్నారు. అయితే రాజధాని అమరావతి నగర బృహత్ ప్రణాళిక డిజైనింగ్, కంతేరు, కాజ, నంబూరు గ్రామాల ప్రాంతీయాభివృద్ధి ప్రణాళికలు, ఇన్నర్ రింగ్‌రోడ్డు ఎలైన్‌మెంట్ ద్వారా లింగమనేని ఆస్తులు, భూముల విలువ పెరగడానికి చంద్రబాబు దోహదపడ్డారని, తద్వారా వారికి అనుచిత లబ్ధి కలిగించారని ఏపీసీఐడీ అభియోగం మోపింది. దాంతో పాటు, లంచం/క్విడ్ ప్రోకో కింద చంద్రబాబుకు లింగమనేని రమేష్ తన ఇంటిని ఉచితంగా ఇచ్చేశారంటూ సీఐడీ ఆరోపించింది. ఈ కేసులో భాగంగా ఆ ఇంటిని జప్తు చేసేందుకు సీఐడీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతిస్తున్నట్లు తెలియజేస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది. అలాగే ఇంటిని జప్తు చేసేందుకు అనుమతి కోసం సీఐడీ విజయవాడ అనిశా కోర్టులో పిటిషన్ వేసింది.