Assam floods 2022: ఒడిశాలో పిడుగుపాటుకు గురై నలుగురు మరణించారు. మరో ఇద్దరు గాయపడ్డారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు. ఈ ఘటన నువాపాడా జిల్లాలోని మల్లికాముండ ప్రాంతంలో జరిగింది. తీర్థనాగ్, లక్ష్మణ్ నాగ్, చూడామణి నాగ్, గన్‌సాగర్ నాగ్‌లను మృతులుగా గుర్తించారు. ఇంటి నిర్మాణ పనులు జరుగుతుండగా పిడుగు పడడం వల్ల ఈ దారుణం జరిగింది. క్షతగాత్రుల్ని చికిత్స నిమిత్తం కోమ్నా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన వల్ల గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
కొండచరియలు విరిగిపడి:మరోవైపు, జమ్ము కశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో దారుణం జరిగింది. భారీ వర్షాల కారణంగా మండి-పూంచ్ రహదారిపై ఉన్న కొండచరియలు విరిగిపడి 45 ఏళ్ల ట్రక్కు డ్రైవర్ మరణించాడు. మృతుడిని తారిఖ్ అహ్మద్ ఖాన్‌గా పోలీసులు గుర్తించారు. ఆగి ఉన్న ట్రక్కును పక్కకు తీస్తుండగా కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో రెస్క్యూ టీం వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని తారిఖ్ అహ్మద్ ఖాన్‌ను ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ అతడు మరణించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో అయిదు దుకాణాలు ధ్వంసమైనట్లు అధికారులు వెల్లడించారు.
భీకర వర్షాల వల్ల: అసోంలో దారుణం జరిగింది. భీకర వర్షాల వల్ల తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. కొండచరియలు విరిగిపడి ముగ్గురు కాచర్ జిల్లాలోని బోరాకై టీ ఎస్టేట్ ప్రాంతంలో మరణించారు. రాష్ట్రంలోని వివిధ ప్రదేశాల్లో వరదల్లో కొట్టుకుపోయి ఆరుగురు మరణించారని అసోం విపత్తు నిర్వహణ అధికారులు తెలిపారు. వరదల వల్ల 30 జిల్లాల్లో 37 లక్షల మందికి పైగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అధికారి వెల్లడించారు. ఈ ఏడాది విపత్తుల వల్ల మరణించిన వారి సంఖ్య 70కి చేరిందని అసోం విపత్తు నిర్వహణ అథారిటీ తెలిపింది.