ఆరేళ్ల బాలికను కిడ్నాప్ చేసి హత్యాచారం చేసిన కేసులో రవీందర్ కుమార్ అనే వ్యక్తికి జీవిత ఖైదు విధించింది దిల్లీ రోహిణి కోర్టు. బాధితురాలి కుటుంబానికి రూ.15లక్షలు సైతం నష్టపరిహారం ఇవ్వాల్సిందిగా జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీని అదేశించింది. కాగా రవీందర్ కుమార్.. గతంలోను ఈ తరహా దారుణాలకు పాల్పడ్డాడు. దాదాపు అతడు 30 మంది చిన్నారులను అపహరించి హత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. దీనిని నిందితుడు సైతం అంగీకరించాడు. ఇంతకుముందు కూడా ఓ కేసులో రవీంద్ర కుమార్.. దోషిగా తేలాడు. మరో కేసు కోర్టులో పెండింగ్‌లో ఉంది.
2015లో రవీందర్ కుమార్.. ఆరేళ్ల బాలికను కిడ్నాప్ చేసి హత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో రవీందర్ కుమార్‌పై బేగంపుర్ పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేశారు పోలీసులు. అనంతరం రోహిణి ప్రాంతంలోని సుఖ్‌బీర్ నగర్ బస్టాండ్ వద్ద దిల్లీ పోలీసులు ఇతడ్ని అరెస్ట్ చేశారు. డజన్ల కొద్దీ కెమెరాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు విశ్లేషించారు. ఇదే కేసులో ప్రస్తుతం రవీంద్ర కుమార్‌కు శిక్ష విధించింది రోహిణి కోర్టు. ఇతడికి 30 మంది మైనర్లను చంపిన కేసులో ప్రమేయం ఉందని.. అందుకే రవీందర్ కుమార్‌కు ఉరిశిక్ష విధించాలని బాధితురాలి తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. అయితే అందుకు తగ్గ ఆధారాలు లేని కారణంగా నిందితుడికి మరణ శిక్ష విధించలేమని కోర్టు సృష్టం చేసింది. కాగా నేరస్థుడు నిరుపేద కుటుంబానికి చెందినవాడని.. అతడి పట్ల కనికరం చూపాలని రవీంద్ర తరపు న్యాయవాది కోర్టును అభ్యర్థించాడు.