దిల్లీ ప్రభుత్వ పథకాలపై ఆప్, భాజపా మధ్య వార్ కొనసాగుతోంది. తాజాగా ఆప్ ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తోన్న ఉచిత విద్యుత్ పథకంపై దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా విచారణకు ఆదేశించారు. అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం ఇచ్చిన విద్యుత్ సబ్సిడీలో చోటుచేసుకున్న అక్రమాలపై దర్యాప్తు చేపట్టాలని ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు ఇచ్చారు. ఏడు రోజుల్లోగా నివేదిక ఇవ్వాలన్నారు.
ఈ పథకం కింద విద్యుత్ సరఫరా చేసే ప్రైవేటు సంస్థలకు దిల్లీ చేస్తోన్న చెల్లింపులకు సంబంధించిన విషయంలో ఈ విచారణ జరగనుంది. ఇదిలా ఉంటే.. మూడు నెలల క్రితం లెఫ్టినెంట్ గవర్నర్ దిల్లీ ప్రభుత్వపు మద్యం విధానంలో సీబీఐ విచారణకు ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే విద్యుత్ పథకం వచ్చి చేరింది. ఇప్పటికే ఈ మద్యం విధానాన్ని కేజ్రీవాల్ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఆ కేసులో పేర్కొన్న నిందితుల్లో ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోదియా పేరు కూడా ఉన్న సంగతి తెలిసిందే.