నూతన వ్యవసాయ చట్టాలతో దేశ రైతులకు ప్రమాదం పొంచి ఉందని దేశంలోని వివిధ విశ్వవిద్యాలయాలకు చెందిన 10 మంది ప్రస్తుత, మాజీ ఆర్థికశాస్త్ర ప్రొఫెసర్లు తెలిపారు. ఈ మేరకు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్‌కు లేఖ రాశారు. రైతుల ఆర్థిక పరిస్థితులను మెరుగు పరచడానికే చట్టాలు తెచ్చామని కేంద్రం చెబుతున్నప్పటికీ పరిస్థితులు వేరుగా ఉన్నట్లు పేర్కొన్నారు. దేశ చిన్న, సన్నకారు రైతుల ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్న ఈ 3 చట్టాలను రద్దు చేయాలని సూచించారు. ఈ చట్టాలు ఎందుకు రద్దు చేయాలో వివరిస్తూ.. 5 ప్రధాన అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నట్లు చెప్పారు. లేఖపై సంతకాలు చేసిన వారిలో హైదరాబాద్ యూనివర్సిటీ రిటైర్డ్ ఎకనమిక్ ప్రొఫెసర్ డి.నరసింహారెడ్డి, టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్‌లో నాబార్డ్ ఛైర్ ప్రొఫెసర్ ఆర్.రామకుమార్ తదితరులున్నారు.
రాష్ట్రాల పాత్రను తగ్గించడం
రాష్ట్ర ప్రభుత్వాల చేతుల్లో ఉన్న వ్యవసాయ మార్కెట్ల నియంత్రణాధికారాన్ని తోసిపుచ్చుతూ కేంద్రం చట్టం చేయడం తప్పు. గ్రామస్థాయిల్లో రైతులకు జవాబుదారీగా అందుబాటులో ఉండేది రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగమే తప్ప కేంద్రం కాదు. అందువల్ల వ్యవసాయ మార్కెట్ యార్డులను రాష్ట్రాలు నియంత్రించడమే మేలు. 2019 జులైలో కేంద్ర వ్యవసాయశాఖ చెప్పినదాని ప్రకారం ప్రైవేటు మండీలు, ఈ-ట్రేడింగ్, ఎలక్ట్రానిక్ పేమెంట్, ఈనామ్‌లను అనుమతిస్తూ 20 రాష్ట్రాలు ఏపీఎంసీ చట్టాలను సవరించాయి. అవన్నీ రాష్ట్ర ప్రభుత్వాల నియంత్రణలోనే పనిచేసేలా అందులో నిబంధన విధించారు. నూతన సంస్కరణలు, విధానాలు విజయవంతం కావాలంటే రైతులు, వ్యాపారులు, కమీషన్ ఏజెంట్లలాంటి భాగస్వాములందరి నుంచి కొనుగోళ్లు జరగాలి. ఈ వ్యవహారాలను స్థానిక పరిస్థితులకు అనుగుణంగా నియంత్రించే స్థాయి రాష్ట్ర ప్రభుత్వాలకే ఉంటుంది. కాగా అన్నింటికే ఒకే విధానాన్ని అవలంబించే కేంద్ర చట్టం ద్వారా ఏమాత్రం ప్రయోజనం ఉండదు.
రెండు మార్కెట్లు.. రెండు నిబంధనలు
కొత్త చట్టం కింద రెండు మార్కెట్లు, రెండు నిబంధనలు ఉంటాయి. ఒకవైపు ఏమాత్రం నియంత్రణలు లేని ప్రైవేటు వ్యవస్థ, మరోవైపు నియంత్రణల మధ్య నడిచే ఏపీఎంసీ మార్కెట్ యార్డులు ఉంటాయి. భిన్న చట్టాలు, భిన్న మార్కెట్ రుసుములు, నిబంధనలు అమలవుతాయి. ఈ పరిస్థితులతో ఇప్పటికే వ్యాపారులు నియంత్రిత మార్కెట్ నుంచి అనియంత్రిత వ్యవస్థలోకి వెళ్లిపోతున్నారు. ఒకవేళ ఏపీఎంసీ మార్కెట్లలో అధికారులు, వ్యాపారుల మధ్య లోపాయికారీ ఒప్పందాలు జరగడమే ప్రధాన సమస్య అయితే అదే పరిస్థితి బయటి ప్రైవేటు మార్కెట్‌లోనూ కనిపించడం ఖాయం. ఇలాంటి మోసాలను అరికట్టడానికి ఏపీఎంసీ మార్కెట్లలో అధికార యంత్రాంగం ఉంది. ప్రైవేటు మార్కెట్లలో అలాంటి వ్యవస్థ ఏదీ ఉండదు. దానివల్ల ధరలతో పాటు, తూకాలు, గ్రేడింగ్, తేమ లాంటి విషయాల్లో రైతులను దోపిడీ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది.
ధరల సమస్య