లేపాక్షి నాలెడ్జి హబ్ భూములకు మరో పెద్ద గండం Lepakshi Knowledge Hub Scam: భారీ భూకుంభకోణాలకు ట్రేడ్‌మార్క్‌గా సుపరిచితమైన "లేపాక్షి నాలెడ్జి హబ్"కు... దివంగత ముఖ్యమంత్రి Y.S.రాజశేఖరరెడ్డి హయాంలో ఉమ్మడి అనంతపురం జిల్లా, ప్రస్తుత సత్యసాయి జిల్లాలో.. 8వేల 844 వేల ఎకరాల భూములు ధారపోశారు. బెంగళూరు - హైదరాబాద్ జాతీయ రహదారి పక్కన.. బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి కేవలం 65 కిలోమీటర్ల దూరాన రోడ్డుకు ఇరువైపులా ఉన్న భూములను కట్టబెట్టారు. అందులో నుంచి 16 వందల కోట్లకు పైగా విలువైన 2వేల 650 ఎకరాల భూమి.. ఇప్పుడు దిల్లీకి చెందిన ఓ ప్రైవేటు సంస్థ వశమయ్యే ప్రమాదం ఏర్పడింది. సదరు సంస్థ నుంచి గతంలో లేపాక్షికి బదిలీ అయిన కేవలం 5 కోట్ల రూపాయల సొమ్మే ఈ పరిస్థితికి కారణమంటే నమ్మశక్యంగా ఉంటుందా..? లోతుల్లోకి వెళ్లి పరిశోధన చేస్తే.. ఇదెంత అడ్డగోలు వ్యవహారమో తెలుస్తుంది.
లేపాక్షి నాలెడ్జ్ హబ్‌కు భూకేటాయింపుల్లో ప్రజాప్రయోజనం అస్సలు లేదని.. ప్రభుత్వ నియమాలన్నీ తుంగలో తొక్కారని.. తన కుమారుడు Y.S.జగన్మోహనరెడ్డి ప్రభావంతోనే నాటి ముఖ్యమంత్రి ఈ అక్రమానికి పాల్పడ్డారని.. ఈ వ్యవహారంపై దాఖలు చేసిన ఛార్జిషీట్‌లో సీబీఐ స్పష్టంగా పేర్కొంది. అందువల్ల ఇప్పటి పరిణామాలకు కూడా Y.S.జగన్‌నే ప్రధాన బాధ్యుడిగా భావించక తప్పదు. సత్యసాయి జిల్లా పరిధిలోని కొడికొండ చెక్‌పోస్ట్ వద్దనున్న భూముల్లో.. 4వేల 191 ఎకరాలను ఇందూ సంస్థ బ్యాంకుల వద్ద తాకట్టు పెట్టింది. అలా తీసుకున్న అప్పులను ప్రాజెక్టు కోసం కాకుండా ఇతర అవసరాలకు వాడుకుంది.
చివరికి బ్యాంకులకు కట్టాల్సిన అప్పులు 4వేల 189 కోట్లకు చేరడంతో చేతులెత్తేసింది. ఇందూ దివాలా ప్రక్రియ ప్రస్తుతం N.C.L.T హైదరాబాద్ శాఖలో కొనసాగుతోంది. దివాలా పేరిట 'ఇందూ' హస్తగతానికి Y.S.జగన్ మేనమామ రవీంద్రనాథరెడ్డి కుమారుడు నరేన్ రామానుజులరెడ్డి కంపెనీ ప్రయత్నించిన విషయాన్ని... గతంలోనే ఈనాడు-ఈటీవీ ఆధార సహితంగా వెలుగులోకి తెచ్చాయి. N.C.L.T హైదరాబాద్ శాఖలో జరుగుతున్న దివాలా ప్రక్రియకు అదనంగా బెంగళూరు శాఖలో లేపాక్షి భూములపై ఇంకో కేసు విచారణలో ఉన్నట్లు తెలియడంతో.... 'ఈనాడు-ఈటీవీ' సంబంధిత పత్రాలను సేకరించాయి. దీంతో మరో 2వేల 650 ఎకరాల దోపిడీ ఉదంతం బయటికొచ్చింది.
గ్లోబల్ నుంచి 5కోట్లు: Y.S.రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వ అండతో వేల ఎకరాల పేదల భూములను కారుచౌకగా కొట్టేసిన లేపాక్షి.. పారిశ్రామిక హబ్ ఏర్పాటుపై కనీస కసరత్తు కూడా చేయలేదు. విక్రయ ఒప్పందాల ద్వారా 2009లో A.P.I.I.C నుంచి భూములు పొందిన ఆ సంస్థ... తొలి నుంచీ ఎలా సొమ్ము చేసుకోవాలా అన్నదానిపైనే దృష్టి పెట్టింది. ఆ క్రమంలోనే 2వేల 650 ఎకరాలను రూ.238.5 కోట్లకు అమ్ముకోవడానికి దిల్లీకి చెందిన గ్లోబల్ ఎమర్జెంగ్ మార్కెట్స్ ఇండియా లిమిటెడ్‌తో... 2012 జనవరి ఏడో తేదీన అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. దాని ప్రకారం లేపాక్షి నాలెడ్జి హబ్ మరో రెండు కొత్త సంస్థల్ని ఏర్పాటు చేసి.. వాటికి 2వేల 650 ఎకరాలు బదిలీ చేయాలి.
తర్వాత ఆ కంపెనీల మొత్తం వాటాలను 238.5 కోట్లకు గ్లోబల్ తీసుకుంటుంది. ఈ ఒప్పందం అమలుకు వేగంగా పావులు కదిపిన లేపాక్షి.. వెనువెంటనే లేపాక్షి సైన్స్ అండ్ టెక్నాలజీ పార్క్ ప్రైవేట్ లిమిటెడ్, లేపాక్షి హెరిటేజ్ వెల్‌నెస్ విలేజ్ పేర్లతో రెండు కంపెనీలు నమోదుచేసింది. సైన్స్ అండ్ టెక్నాలజీకి 2వేల ఎకరాలు, వెల్‌నెస్ విలేజ్‌కు 650 ఎకరాల బదిలీకి అవసరమైన ఖర్చుల కోసమంటూ.... గ్లోబల్ నుంచి 5 కోట్లు తీసుకుంది. 2012 మార్చి 19న ఇంటర్ కార్పొరేట్ డిపాజిట్- I.C.D ఒప్పందం కింద.. లేపాక్షి సైన్స్ అండ్ టెక్నాలజీకి గ్లోబల్ సంస్థ 5 కోట్లు ఇచ్చింది. ఆ డబ్బుకు లేపాక్షి వెల్‌నెస్ విలేజ్‌ను హామీదారుగా పెట్టుకుంది.
ఎన్సీఎల్టీకి వెళ్లిన గ్లోబల్: లేపాక్షి సైన్స్‌కు గ్లోబల్ నుంచి 5 కోట్లు అందిన సమయంలోనే.. లేపాక్షి నాలెడ్జి హబ్ భూములపై సీబీఐ విచారణ మొదలైంది. దీంతో గ్లోబల్‌కు 2వేల 650 ఎకరాలు విక్రయించే ప్రక్రియను ముందుకు తీసుకెళ్లడం లేపాక్షికి సాధ్యం కాలేదు. లేపాక్షి హబ్ పేరిట సాగిన అక్రమాలపై 2013 సెప్టెంబర్ 17నసీబీఐ ఛార్జిషీట్ వేసింది. ఆ తర్వాత తొమ్మిదేళ్లు గడిచిపోయాక N.C.L.T.కి వెళ్లిన గ్లోబల్ సంస్థ... తామిచ్చిన 5 కోట్ల అప్పు వడ్డీతో సహా 25.84 కోట్లు అయినట్లు పేర్కొంది. లేపాక్షి నాలెడ్డి హబ్ కుదుర్చుకున్న ఒప్పందం మేరకు లేపాక్షి సైన్స్ అండ్ టెక్నాలజీ, లేపాక్షి వెల్‌నెస్ విలేజ్ ద్వారా 2వేల 650 ఎకరాల భూమి అప్పగింతలో విఫలమైనందున... ఆ రెండు సంస్థలకు వ్యతిరేకంగా దివాలా ప్రక్రియ చేపట్టాలని N.C.L.T బెంగళూరు శాఖలో 2021లో పిటిషన్ వేసింది.
5 కోట్లు అందుకున్నందుకు లేపాక్షి సైన్సును, పూచీకత్తుగా ఉన్నందుకు వెల్‌నెస్ విలేజ్‌ను బాధ్యుల్ని చేసింది. ఇప్పటికే చాలా కాలం వేచి చూసినట్లు తెలిపింది. దీనిపై ట్రైబ్యునల్‌లో లేపాక్షి గ్రూప్ వాదనలు వినిపించింది. భూముల కోసం చెల్లించాల్సిన 238.5 కోట్లలో పైసా కూడా ఇవ్వనందున... పిటిషనర్ వాదనను అంగీకరించవద్దని కోరింది. ఇరుపక్షాల వాదనలు విన్న ట్రైబ్యునల్.. గ్లోబల్ వాదనలోనే బలం ఉందని భావించింది. దివాలా ప్రక్రియలో భాగంగా ముంబయికి చెందిన హేమేంద్ర పలివాల్‌ను తాత్కాలిక రిజల్యూషన్ ప్రొఫెషనల్‌గా గత జూన్‌లో నియమించింది. ఈ ఉత్తర్వులపై లేపాక్షి నాలెడ్జి హబ్ చెన్నైలోని N.C.L.T. అప్పిలేట్ ట్రైబ్యునల్‌కు వెళ్లింది. అప్పిలేట్ ట్రైబ్యునల్ కూడా బెంగళూరు శాఖ తీర్పునే సమర్థించింది. దీనిపై లేపాక్షి సంస్థ పిటిషన్ సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉంది.
ఎన్నో అనుమానాలు: ఒక ప్రాంత అభివృద్ధి కోసమంటూ ప్రభుత్వం సేకరించి ఇచ్చిన భూమి, దివాలా ప్రక్రియ ద్వారా అన్యాక్రాంతమయ్యే పరిస్థితికి దారితీసిన పరిణామాలను చూస్తే... ఏవీ సహజంగా జరిగినట్లు అనిపించడం లేదు. వ్యవహారమంతా అడ్డగోలుగా, కుట్ర ప్రకారం నడిపిస్తున్నట్లు ఉంది. తాను మరో రెండు కంపెనీలను ఏర్పాటుచేసి, వాటి ద్వారా 2వేల 650 ఎకరాలను 238 కోట్లకు దిల్లీ సంస్థకు విక్రయించడానికి.. 2012 జనవరి 7న లేపాక్షి నాలెడ్జి హబ్ ఒప్పందం చేసుకుంది. దిల్లీ సంస్థ నుంచి లేపాక్షికి భూ-బదలాయింపు ఖర్చులుగా అదే ఏడాది మార్చిలో 5 కోట్లు అందింది.
ఈ మొత్తంపై 2012 మార్చి 19న గ్లోబల్, లేపాక్షి సైన్స్ మధ్య ఇంటర్ కార్పొరేట్ డిపాజిట్ ఒప్పందం జరగ్గా... అంతకంటే ముందు మార్చి ఐదో తేదీనే గ్లోబల్ సంస్థ ప్రతినిధి గుల్షన్‌కుమార్‌ను లేపాక్షి సైన్సు, లేపాక్షి వెల్‌నెస్ విలేజ్ సంస్థల్లో డైరెక్టర్‌గా చేర్చారు. ఇది చాలా అనహజంగా ఉంది. లేపాక్షి సైన్సు, లేపాక్షి వెల్‌నెస్ పేర్లతో పెట్టిన కంపెనీలకు... 2012 ఏప్రిల్‌లో నాలెడ్జి హబ్ నుంచి భూమిని బదలాయిస్తూ రిజిస్ట్రేషన్ చేసేశారు. ఇంత వేగంగా ఈ పనులన్నీ చేసిన నాలెడ్జ్ హబ్... విక్రయ ధరలో తొలుత ఇచ్చిన 5 కోట్లు కాకుండా ఇతరత్రా ఎలాంటి డబ్బు దిల్లీ సంస్థ నుంచి రానప్పుడు... ఒప్పందాన్ని ఎందుకు రద్దు చేసుకోలేదో ఆశ్చర్యం కలిగిస్తోంది. లేపాక్షి సైన్సు, వెల్‌నెస్ విలేజ్‌లో గ్లోబల్ ప్రతినిధి ఇప్పటికీ డైరెక్టర్‌గా కొనసాగుతుండటం గమనార్హం.
జగనే లబ్ధిదారు.. మొదటి నిందితుడు: దిల్లీ సంస్థతో ఒప్పందం కుదిరిన రెండేళ్ల తర్వాత 2013-14 ఆర్థిక సంవత్సరానికి R.O.C.కి సమర్పించిన బ్యాలెన్స్ షీట్‌లో... ఆ ఏడాది ఇతర భూముల విక్రయాలపై 54 కోట్ల రాబడి వచ్చినట్లు లేపాక్షి నాలెడ్జి హబ్ చూపింది. మరి ఆ డబ్బుతో దిల్లీ సంస్థ నుంచి తీసుకున్న డబ్బును తిరిగి ఇచ్చేసి ఒప్పందాన్ని రద్దు చేసుకునే అవకాశం ఉన్నా ఎందుకు చేయలేదు..? పరిస్థితి దివాలా ప్రక్రియ వరకూ వెళ్లేలా ఎవరి ప్రయోజనాల కోసం వ్యవహరించారు..? లేపాక్షి పేరుతో జరిగిన భూకుంభకోణంపై నాడు సమగ్ర దర్యాప్తు చేసిన సీబీఐ... అప్పటి ముఖ్యమంత్రి తనయుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి Y.S.జగన్మోహనరెడ్డిని ఛార్జిషీట్‌లో మొదటి నిందితుడిగా చేర్చింది.
లేపాక్షి హబ్‌కు అక్రమ పద్ధతుల్లో భూములు కేటాయించినందుకు ప్రతిఫలంగా జగన్ కంపెనీల్లోకి దాదాపు 70 కోట్లు పెట్టుబడులుగా వచ్చినట్లు పేర్కొంది. ప్రస్తుతం వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా ఉన్న వి.విజయసాయిరెడ్డి, ఇందూ గ్రూపు అధినేత ఐ.శ్యాంప్రసాదరెడ్డితోపాటు.. ఉమ్మడి రాష్ట్ర రెవెన్యూ మంత్రిగా పనిచేసిన ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావునూ నిందితుల జాబితాలో చేర్చింది. అందువల్ల లేపాక్షి భూములకు ఇప్పుడుపడుతున్న దుర్గతికి జగన్‌తో పాటు వారూ బాధ్యత వహించాల్సి ఉంటుంది.