Leopard Trapped in Tirumala: తిరుమల నడక దారిలో మూడు సంవత్సరాల బాలుడిపై గురువారం దాడి చేసిన చిరుత ఎట్టకేలకు బోనులో చిక్కింది. అలిపిరి నడక మార్గం ఏడో మైలు వద్ద చిక్కింది. దాడి అనంతరం అలిపిరి మెట్ల మార్గంలో 150 ప్రాంతాల్లో అధికారులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అటవీ శాఖ అధికారులు.. చిరుత సంచారాన్ని గమనించి శుక్రవారం సాయంత్రం రెండు వేర్వేరు ప్రాంతాల్లో రెండు ఇనుప బోన్లను ఏర్పాటు చేశారు. నిన్న రాత్రి 10:45 గంటల ప్రాంతంలో చిరుత బోనులో చిక్కినట్లు అధికారులు వెల్లడించారు. బోనులో చిక్కిన చిరుతను టీటీడీ ఈవో ధర్మారెడ్డి పరిశీలించారు. అలిపిరి మెట్ల మార్గంలో బాలుడిపై దాడి చేసిన చిరుతగా అధికారులు అనుమానిస్తున్నారు. చిరుత బోనులో చిక్కుకోవడంతో.. ఈ ఘటన జరిగినప్పటి నుంచి బిక్కుబిక్కుమంటూ నడక దారిలో వెళుతున్న శ్రీవారి భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. ఒక్క రోజు వ్యవధిలోనే చిరుతను బంధించడంపై టీటీడీ అధికారులను అభినందిస్తున్నారు.
చిరుత బోనులో చిక్కుకున్న ప్రదేశాన్ని.. తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ధర్మారెడ్డి పరిశీలించారు. బాలుడిపై దాడిచేసిన రోజే.. చిరుత సంచారాన్నిగుర్తించామన్నారు. తల్లి చిరుత కూడా అదే ప్రాంతంలో సంచరిస్తోందని.. దాన్ని కూడా పట్టుకుని దూరంగా వదిలేస్తామని ప్రకటించారు. తల్లి పులి జాడ కూడా కెమెరాల్లో తెలిసిందన్నారు. తల్లి పులి ఎప్పుడూ మనుషులపై దాడి చేయలేదని... మొన్న పిల్లిని వేటాడపోయి బాలుడిపై చిరుత దాడి చేసిందని ఈవో ధర్మారెడ్డి తెలిపారు.