మద్రాస్ హైకోర్టు అదనపు జడ్జీగా.. మహిళా న్యాయవాది లక్ష్మణ చంద్ర విక్టోరియా గౌరీని ఎంపిక చేయడంపై తమకు ఎలాంటి సమస్య కనిపించడం లేదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఆమె నియామకానికి వ్యతిరేకంగా దాఖలైన రిట్ పిటిషన్ను కొట్టివేసింది. ప్రతిభ ఆధారంగానే న్యాయమూర్తుల ఎంపిక ఉంటుందని స్పష్టం చేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులను సంప్రదించిన తర్వాతే.. జడ్జీలను కొలీజియం ఎంపిక చేస్తుందని గుర్తు చేసింది. రాజకీయ నేపథ్యం ఉన్న వారు చాలా మంది సుప్రీంలో పనిచేశారని, అయితే ఈ పదవిలో ఉన్నవారికి రాజ్యాంగమే ప్రధానమని స్పష్టం చేసింది.
మద్రాస్ హైకోర్టు అదనపు జడ్జీగా గౌరీ ప్రమాణం.. అభ్యంతరాలు తోసిపుచ్చిన సుప్రీం
మహిళా న్యాయవాది లక్ష్మణ చంద్ర విక్టోరియా గౌరీని మద్రాస్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా ఎంపిక చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. మరోవైపు, ఈ కేసు విచారణ జరుగుతుండగానే గౌరీ.. మద్రాస్ హైకోర్టు జడ్జీగా ప్రమాణస్వీకారం చేశారు.
ఓవైపు గౌరీ అర్హతల వివాదంపై సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ జరుపుతుండగానే.. ఉదయం 10.35 గంటలకు ఆమె మద్రాస్ హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా ప్రమాణస్వీకారం చేశారు. మరో నలుగురు సైతం న్యాయమూర్తులుగా ప్రమాణం చేశారు. గౌరీ ప్రమాణస్వీకారాన్ని వాయిదా వేయాలన్న అభ్యర్థనను సైతం సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.
అభ్యంతరాలివీ:
మద్రాస్ హైకోర్టుకు చెందిన మదురై ధర్మాసనం విచారించే కేసుల్లో కేంద్ర ప్రభుత్వం తరఫున న్యాయవాది గౌరీ హాజరయ్యే వారు. ఆమెకు భాజపాతో రాజకీయ సంబంధాలున్నాయనే విమర్శలతో పాటు క్రిస్టియన్లు, ముస్లింల గురించి విద్వేష ప్రసంగాలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి.