న్యాయ విద్యను అభ్యసిస్తున్న వారితో పాటు.. న్యాయవాదులు సమాజంలోని అణగారిన వర్గాల గొంతుకుగా ఉండేలా శక్తిమంతం కావాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఆకాక్షించారు. న్యాయవాద వృత్తి లాభాలను అర్జించడం కోసం కాదని.. సమాజానికి సేవ చేసేందుకేనని అభిప్రాయపడ్డారు. జాతీయ న్యాయ సేవల దినోత్సవాన్ని పురస్కరించుకుని నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ(నల్సా) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హజరైన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
"అవసరమైన వారికి న్యాయ సహాయం అందించేందుకు ముందుకు రావాలన్న మీ నిర్ణయం గొప్పది. పేదలపట్ల సానుభూతి, వారి కష్టాల పట్ల అవగాహన, సేవ చేయడంలో నిస్వార్థ భావాన్ని పెంపొందించేందుకు ఇది తోడ్పడుతుంది. ఇతర వృత్తుల మాదిరిగా కాకుండా.. న్యాయవాద వృత్తిని లాభం కోసం కాకుండా.. సమాజ సేవ కోసమే ఎంచుకోండి."
---సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ
నల్సా ఆధ్వర్యంలో నిర్వహించే మూట్ కోర్ట్ పోటీల్లో పాల్గొని ఉత్సాహం చూపిన యువ న్యాయ విద్యార్థుల పట్ల జస్టిస్ ఎన్వీ రమణ హర్షం వ్యక్తం చేశారు.
"మీ చుట్టూ ఉన్న సమాజం పట్ల అప్రమత్తంగా ఉంటూ.. సమస్యలపై సరైన సమయంలో స్పందించడం మీ కర్తవ్యం. నిరుపేదలకు న్యాయ సహాయం అందించడంలో న్యాయ విద్యార్థులు ప్రధాన పాత్ర పోషిస్తున్నందుకు చాలా సంతోషిస్తున్నా.
---సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ
ఈ సందర్భంగా నల్సా ఆన్‌లైన్ పోర్టల్ సేవలను మరిన్ని భాషల్లో ఆవిష్కరించిన జస్టిస్ ఎన్వీ రమణ.. లీగల్ సర్వీసెస్ అప్లికేషన్ ఐఓఎస్ వెర్షన్‌ను ప్రారంభించారు.