Left parties on Assembly elections : ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు గల్లీ నుంచి దిల్లీ స్థాయి వరకు అన్ని పక్షాలు.. తమ సత్తా చాటేందుకు ఊవిళ్లూరుతున్నాయి. పొత్తుల చర్చలు, సీట్ల కేటాయింపులతో బిజీబిజీగా గడుపుతూ.. ఆయా పార్టీల నాయకులు వార్తల్లో నిలుస్తున్నారు. అయితే దశాబ్దాల చరిత్ర, ఓటు బ్యాంకు కలిగి ఉన్న వామపక్షాల సందడి మాత్రం ఎక్కడా కనిపించడం లేదు.
వామపక్షాల్లో కీలకంగా చెప్పుకునే సీపీఐ, సీపీఎం ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపై ఇంత వరకు పెదవి విప్పలేదు. ఉత్తర్ ప్రదేశ్తో పాటు, పంజాబ్‌లో తమ పార్టీల శాఖలు క్రీయాశీలకంగా పనిచేస్తున్నా.. ఈ ఎన్నికల బరిలో దిగుతామని కానీ, ఫలానా పార్టీకి మద్దతు ఇస్తున్నామని కానీ.. ఇప్పటి వరకు ఆ పార్టీలు ప్రకటించలేదు. సీపీఐ, సీపీఎం తర్వాత ఎక్కువ రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న వామపక్ష పార్టీ సీపీఐ-ఎంఎల్ మాత్రం పంజాబ్‌లో 10 నుంచి 12 స్థానాల్లో పోటీ చేస్తామని వెల్లడించింది.
అయితే పోటీ చేసే విషయంపై సీపీఐ, సీపీఎం నాయకత్వాలు చర్చలు జరుపుతున్నాయని, పంజాబ్‌లో 12 స్థానాల్లో తాము పోటీ చేయాలనుకుంటున్నట్లు ఇరు పక్షాలకు చెందిన నాయకులు చెబుతున్నారు.
"అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపై చర్చించేందుకు రెండు పార్టీల రాష్ట్ర విభాగాలు చర్చలు జరుపుతున్నాయి. అయితే ఎన్నికల్లో పోటీ చేయాలా? లేక భాజపాను ఓడించగల శక్తికి మద్దతు ఇవ్వాలా? అనే దానిపై తుది నిర్ణయం దిల్లీ నాయకత్వం తీసుకుంటుంది" అని సీపీఎం సీనియర్ నాయకుడు ఒకరు ఈటీవీ భారత్‌తో అన్నారు.
భాజపాను ఓడించే సామర్థ్యం ఉన్న పార్టీకి వ్యతిరేకంగా పోటీ చేయకూడదని వామపక్షాలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అలాంటి చోట్ల భాజపాకు వ్యతిరేకంగా ప్రచారం చేసేందుకు... ఇతర పార్టీలతో చేతులు కలుపుతామని నాయకులు చెబుతున్నారు.
cpm, cpi contest on assembly polls
2017లో అన్నింటా ఓటమే..
2017 అసెంబ్లీ ఎన్నికల్లో మూడు ప్రధాన వామపక్ష పార్టీలైన సీపీఐ, సీపీఎం, సీపీఐ-ఎంఎల్ పార్టీలు ఉత్తర్ప్రదేశ్లో 160 స్థానాలకు పైగా పోటీ చేసినప్పటికీ ఒక్క సీటు కూడా గెలవలేకపోయాయి. పంజాబ్‌లో సీపీఐ, రివల్యూషనరీ మార్క్సిస్ట్ పార్టీ కలిసి.. 36 స్థానాల్లో పోటీ చేస్తే.. అక్కడ ఫలితం శూన్యం. ఉత్తరాఖండ్, గోవా, మణిపుర్ రాష్ట్రాల్లో కూడా కామ్రేడ్లకు రిక్తహస్తమే మిగిలింది. ఈ క్రమంలో ఎన్నికల బరిలో నిలిచినా, నిలవకపోయినా.. ఎలాంటి తేడా ఉండదనే అభిప్రాయానికి కామ్రేడ్లు వచ్చినట్లు తెలుస్తోంది. అందుకే పోటీ చేసే విషయంపై పునరాలోచిస్తున్నట్లు సమాచారం.