బంగాల్లో వామపక్ష కూటమికి మరోమారు భంగపాటు తప్పలేదు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి(వామపక్షాలు-కాంగ్రెస్-ఐఎస్‌ఎఫ్) అసలు ప్రభావం చూపలేకపోయాయి. టీఎంసీ-భాజపా మధ్య జరుగుతున్న యుద్ధంలో కింగ్ మేకర్‌గా అవతరిస్తామనుకున్న కూటమి నేతలకు తీవ్ర నిరాశ ఎదురైంది. దీంతో రాష్ట్రంలో ఇప్పటికే దారుణంగా ఉన్న ఆయా పార్టీల పరిస్థితి.. ఈ ఎన్నికలతో మరింత ప్రమాదంలో పడింది.
ప్రభావం శూన్యం...!
బంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, వామపక్షాలు కూడా ఆశలు పెట్టుకున్నాయి. ముస్లిం మతపెద్ద అబ్బాస్ సిద్ధిఖి స్థాపించిన ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్‌ఎఫ్)తో జతకట్టి 'సంయుక్త మోర్చా' పేరుతో మూకుమ్మడిగా బరిలోకి దిగాయి. నేరుగా పదవిలోకి రాలేకున్నా.. ఈసారి ఎన్నికల్లో తాము కింగ్ మేకర్ అయ్యే అవకాశాలున్నాయని ఈ కూటమి నేతలు అంచనా వేశారు. తృణమూల్ కాంగ్రెస్, భాజపాకు మెజార్టీ రాని పరిస్థితి ఏర్పడితే.. తాము నిర్ణయాత్మకంగా మారుతామని లెక్కలు వేసుకున్నారు.
ఇదీ చూడండి:-'కరోనా యోధులపై పని భారం తగ్గించేదెలా?'
294 నియోజకవర్గాలున్న బంగాల్లో ఈసారి వామపక్షాలు 177 స్థానాల్లో పోటీ చేశాయి. కాంగ్రెస్ 91, ఐఎస్‌ఎఫ్ 26 స్థానాల్లో బరిలోకి దిగాయి. కానీ ఆయా పార్టీలు ఘోర పరాభవాన్ని చవిచూశాయి.