మైసూర్ ప్యాలెస్‌కు 'లీకేజీ' కష్టాలు కర్ణాటక అనగానే గుర్తొచ్చే చారిత్రక కట్టడం మైసూర్ ప్యాలెస్. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఈ భవనం.. ఇప్పుడు తన అందాలను కోల్పోయే పరిస్థితి వచ్చింది. ఇటీవల కురిసిన భారీ వర్షాల(karnataka rain) ధాటికి ప్యాలెస్(Mysore palace leakage) దెబ్బతింది. పైకప్పు నుంచి అక్కడక్కడా వర్షపు నీరు కారుతోంది. పైకప్పునకు ఉన్న ప్లాస్టరింగ్ దెబ్బతింది. ప్యాలెస్ గోడలు తడిగా మారి, నాచు పేరుకుపోయాయి.
పైకప్పు నుంచి కారుతున్న వర్షపు నీరు పైకప్పు ప్లాస్టర్ ఊడిపోయిన దృశ్యం గతంలో కూడా మైసూర్ ప్యాలెస్ లీకేజీ సమస్యను ఎదుర్కొంది. అయితే.. అప్పుడు మరమ్మతులు చేశారు. కానీ, ఇటీవల కురిసిన వర్షాల కారణంగా.. ప్యాలెస్‌లో మళ్లీ లీకేజీ సమస్య ఎదురవుతోంది. ప్యాలెస్‌లో రాజకుటుంబ సభ్యులు నివసించిన ప్రాంతాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంది.
ప్యాలెస్ గోడలపై పేరుకుపోయిన నాచు ప్యాలెస్ నిర్వహణలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై యదువీర్ కృష్ణదత్త చామరాజా వడియార్ తల్లి ప్రమోదా దేవీ వడియార్ అసంతృప్తి వ్యక్తం చేశారని ప్యాలెస్ వర్గాలు తెలిపాయి. అయితే.. వర్షాల కారణంగా బోర్డు పరిధిలోకి వచ్చే ప్రాంతాల్లో ఎలాంటి సమస్య ఎదురవలేదని మైసూర్ ప్యాలెస్ బోర్డ్ డిప్యూటీ డైరెక్టర్ టీఎస్ సుబ్రహ్మణ్య తెలిపారు.
అధికారులు తక్షణమే స్పందించి.. మరమ్మతులు చేపట్టకపోతే.. ప్యాలెస్ పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చూడండి:ల్యాబ్‌లోకి వరద నీరు.. శాస్త్రవేత్తల కష్టం నీటి పాలు!