leafy vegetables Campaigner kerela :తోటకూర తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుందా? ఆకుకూరల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్‌ను ఆపగలవా? కళ్లు బాగా కనిపించాలంటే ఏం తినాలి? ఇటువంటి ప్రశ్నలన్నింటికీ ఓ వృద్ధుడు టకాటకా సమాధానాలు చెప్పేస్తున్నాడు. అలాగని ఆయనేమీ వైద్యుడో, పోషకాహార నిపుణుడో కాదు. కానీ ఆకుకూరల్లో ఉండే ఔషధ గుణాలపై పూర్తి అవగాహన తెచ్చుకున్నాడు. ఆతడే కేరళకు చెందిన అబూబాకర్ అనే 82 ఏళ్ల వృద్ధుడు.
కోజికోడ్‌లోని పుక్కాడ్‌కు చెందిన వన్నంగుని అబూబాకర్‌కు చిన్నప్పటి నుంచి వ్యవసాయం అంటే చాలా ఇష్టం. అందుకే తనకున్న భూమిలో దాదాపు 50 రకాల ఆకుకూరలను, అలాగే కొన్ని రకాల పండ్ల చెట్లను పెంచుతున్నాడు. కంటి సమస్యలు, ఊబకాయం, రక్తహీనత, బీపీ, గుండె సంబంధిత వ్యాధుల నుంచి బయటపడాలంటే ఆకుకూరలను రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలని సూచిస్తున్నాడు. మనకు దొరికే ఆకుకూరల్లోనే ఔషధ గుణాలు మెండుగా ఉన్నాయని అంటున్నాడు.
"మనకు తెలిసిన కూరగాయల మొక్కలను 10 సెంట్లు లేదా ఐదు సెంట్ల భూమిలో సాగు చేసుకోవచ్చు. అవి మనకు ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తాయి. మొక్కలు మనకు దేవుడు ఇచ్చినవి. వాటిని మనమే కాపాడుకోవాలి."
--అబూబాకర్, రైతు
ఆకుకూరల వల్ల కలిగే ప్రయోజనాలు, వాటిలో ఉన్న ఔషధ గుణాలు తనకు చిన్నప్పుడే తెలుసని అబూబాకర్ చెబుతున్నాడు. ఆకు కూరల్లో పుష్కలంగా మాంసకృత్తులు, కొవ్వులు, కార్బోహైడ్రేట్లు, విటమిన్లు, మినరల్స్, ఫైబర్ అధికంగా ఉంటుందని అంటున్నాడు. కోజికోడ్‌లో జరిగే వ్యవసాయ సమ్మేళనాల్లో పాల్గొని.. అక్కడ వేలాది మందికి ఆకుకూరల వల్ల కలిగే లాభాలను వివరిస్తుంటానని అబూబాకర్ తెలిపాడు.