తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మణిపుర్​లో ప్రధాన ప్రచారాంశంగా 'రాజకీయ హింస'

Manipur Polls 2022: మణిపుర్‌ ఎన్నికల్లో ఈసారి రాజకీయ హింస కూడా ప్రచారాంశంగా నిలుస్తోంది. కాంగ్రెస్​తో పాటు ఎన్‌పీపీ అధ్యక్షుడు, మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్‌ సంగ్మా ​ ఈ అంశాన్నే ప్రస్తావిస్తున్నారు.

manipur elections
మణిపుర్​ అసెంబ్లీ ఎన్నికలు

By

Published : Feb 22, 2022, 7:48 AM IST

Manipur Assembly Elections: సైనిక బలగాలు, వాటికి ప్రత్యేకాధికారాలు కల్పిస్తున్న చట్టం, తీవ్రవాదం.. ఇలాంటి అంశాలతో పాటు రాజకీయ హింస కూడా ఈసారి మణిపుర్‌ ఎన్నికల్లో ప్రచారాంశంగా నిలుస్తోంది. నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ (ఎన్‌పీపీ) అధ్యక్షుడు, మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్‌ సంగ్మా దీనిని ఎన్నికల అంశంగా ముందుకు తీసుకువెళ్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు ఓ ఎన్‌పీపీ అభ్యర్థి తండ్రిపై మూడు రోజుల క్రితం దాడికి పాల్పడ్డారు. ఎన్నికల తేదీలు ఖరారైనప్పటి నుంచి ఇలాంటివి వరసగా జరుగుతున్నాయి. కార్యకర్తల్ని బెదిరిస్తున్న తీవ్రవాదులందరినీ కటకటాల వెనక్కి నెట్టాలని సంగ్మా డిమాండ్‌ చేస్తున్నారు. ఎన్నికల ప్రచారం నిమిత్తం మణిపుర్‌లో ఆయన విస్తృతంగా పర్యటిస్తున్నారు. హింసకు పాల్పడుతున్నవారిని తిరస్కరించాలని ప్రతి సమావేశంలోనూ పిలుపునిస్తున్నారు. తగినన్ని సీట్లు సాధించి, ప్రభుత్వాన్ని తామే ఏర్పరుస్తామని ఆయన ఆశాభావంతో ఉన్నారు.

ఈసీకి కాంగ్రెస్‌ ఫిర్యాదు

రాజకీయపరమైన హింసపై కాంగ్రెస్‌ కూడా ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసింది. ఎన్నికల్లో ఓటమి తప్పదని తెలిసి భాజపా వర్గాలు హింసకు దిగుతున్నాయని దానిలో పేర్కొంది. 14 ప్రధాన ఘటనల్ని ప్రస్తావిస్తూ.. మణిపుర్‌లో స్వేచ్ఛగా, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు పూర్తయ్యేలా చూడాలని కోరింది. దాడులకు గురైనవారిలో ఎన్‌పీపీతో పాటు జేడీ(యూ), శివసేన నాయకులూ ఉన్నారు. హింసను ప్రోత్సహించే ప్రసక్తి లేదని మణిపుర్‌ ముఖ్యమంత్రి బీరేన్‌సింగ్‌ తేల్చి చెబుతున్నారు. ఈ రాష్ట్రంలో ఈ నెల 28న తొలిదశ, మార్చి 5న రెండోదశ ఎన్నికలు జరగనున్నాయి.

'మణిపుర్‌ చరిత్రను కాపాడేది మేమే'

మణిపుర్‌ చరిత్ర, సంస్కృతి, భాషను కాపాడేది కాంగ్రెస్‌ పార్టీయే. భాజపా, ఆరెస్సెస్‌ వీటిని నిర్లక్ష్యం చేశాయి. ఒకే సైద్ధాంతికత ఉండాలనే భాజపా భావిస్తుంది. మేం ఇక్కడ అధికారంలోకి వస్తే మహిళలకు 33% రిజర్వేషన్‌ కల్పిస్తాం. వరి ఉత్పత్తిలో రాష్ట్రం స్వయం సమృద్ధి సాధించేలా చూస్తాం. మణిపుర్‌ కంటే యూపీ పెద్దదైనా మా దృష్టిలో రెండు రాష్ట్రాలూ ముఖ్యమే.

- రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్‌ అగ్రనేత

ఇదీ చదవండి:కాంగ్రెస్​కు 'ఈవీఎం' ట్యాంపరింగ్​ భయం.. కార్యకర్తలతో కాపలా!

ABOUT THE AUTHOR

...view details