కేరళలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. సీపీఎం నేతృత్వంలోని వామపక్ష కూటమి(ఎల్డీఎఫ్) మేనిఫెస్టోను విడుదల చేసింది. నిరుద్యోగులను ఆకర్షిస్తూ.. కొత్తగా 40లక్షల ఉద్యోగ నియామకాలు చేపడతామని పేర్కొంది. అంతేకాకుండా.. ప్రతి గృహిణికి పింఛను ఇస్తామని హామీ ఇచ్చింది. ఏకేజీ(అయిల్లయత్ కుట్టియరి గోపాలన్) కేంద్రంలో.. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి ఏ.విజయ రాఘవన్, సీపీఐ కార్యదర్శి కన్నన్ రాజేంద్రన్, వామపక్షాల ఇతర నాయకులు ఈ మేనిఫెస్టోను విడుదల చేశారు.
తీర ప్రాంతాల అభివృద్ధికి రూ.5వేల కోట్లు
తీరాలను కోత నుంచి రక్షించేందుకు.. తీర ప్రాంతాల అభివృద్ధి కోసం రూ.5వేల కోట్ల ప్యాకేజీ, రబ్బరు కనీస మద్దతు ధర రూ.250కి పెంచడం సహా.. గుడ్లు, పాలు, కూరగాయల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధిస్తామని మేనిఫెస్టోలో పేర్కొంది. నిరుపేదల కోసం 'లైఫ్' మిషన్ ప్రాజెక్ట్ కింద ఇచ్చే ఇళ్లు కాకుండా.. గిరిజన, షెడ్యూల్డ్ కులాల వారికీ ఆవాసం కల్పిస్తామని ఈ సందర్భంగా విజయ రాఘవన్ తెలిపారు.
పినరయి విజయన్ నేతృత్వంలోని ఎల్డీఎఫ్ సర్కార్ అవినీతి రహిత పాలనను కొనసాగిస్తుందని రాఘవన్ అన్నారు. ఈ మేనిఫెస్టోతో మరోసారి అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తంచేశారు.
ఇదీ చదవండి:'బంగాల్లో నిష్పాక్షిక ఎన్నికలు కష్టమే!'