తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'కేరళలో ఆ రెండు కూటముల​ మ్యాచ్ ఫిక్సింగ్' - మోదీ ఎన్నికల ర్యాలీ

కొన్ని బంగారు ముక్కల కోసం కేరళ ప్రజలను ఎల్​డీఎఫ్​ మోసం చేస్తోందని ఆరోపించారు ప్రధాని నరేంద్ర మోదీ. కేరళ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ఆయన.. ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని రెండు ప్రధాన కూటములు రహస్య ఒప్పందంతో రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు.

LDF has betrayed Kerala for a few pieces of gold: PM
'బంగారు ముక్కల కోసం కేరళ ప్రజలకు మోసం'

By

Published : Mar 30, 2021, 12:04 PM IST

Updated : Mar 30, 2021, 1:49 PM IST

కేరళలోని అధికార, ప్రతిపక్ష పార్టీలపై విమర్శలతో విరుచుకుపడ్డారు ప్రధాని నరేంద్ర మోదీ. ఎన్నో ఏళ్లుగా ఎల్​డీఎఫ్​, యూడీఫ్​ రహస్యంగా స్నేహపూర్వక ఒప్పందంతో రాష్ట్రంలో రాజకీయాలు సాగిస్తున్నాయని ధ్వజమెత్తారు. ఆ రెండు కూటముల​ మ్యాచ్ ఫిక్సింగ్​పై యువత తొలిసారిగా ప్రశ్నించారని.. దీంతో రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పు జరుగుతాయన్నారు. ఆ కూటములు.. తమను ఎలా తప్పుదారి పట్టిస్తున్నాయో ప్రజలు గమనిస్తున్నారని వ్యాఖ్యానించారు.

పాలక్కడ్​లోని ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు మోదీ. ఈ క్రమంలో పసిడి కుంభకోణంపై పరోక్షం విమర్శించారు. "కొన్ని వెండి ముక్కల కోసం ఏసు ప్రభువును మోసం చేశాడు జూదాస్​. అలాగే కొన్ని బంగారు ముక్కల కోసం రాష్ట్ర ప్రజలను ఎల్​డీఎఫ్​ మోసం చేస్తోంది" ఆరోపించారు ప్రధాని.

సిగ్గు చేటు..

శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలకు ప్రవేశం కల్పిస్తూ ఇచ్చిన సుప్రీం కోర్టు తీర్పునకు వ్యతిరేకంగా ఎల్​డీఎఫ్​ వ్యవహరించిన తీరును తప్పుపట్టారు ప్రధాని. అమాయక భక్తులపై లాఠీ ఛార్జీ చేయడంపై అధికార పార్టీ సిగ్గు పడాలని వ్యాఖ్యానించారు. మన సంస్కృతిని చెడగొట్టే ప్రయత్నం చేస్తే.. తమ పార్టీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు.

'గూండాల్లా ప్రవర్తిస్తున్నారు'

రాష్ట్రంలో అనేక సార్లు అధికారం చేపట్టిన వామపక్షాలు.. మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు విపక్షాల నేతను చంపడం, కొట్టడం సహా హింసాత్మక చర్యలకు పాల్పడుతూ.. గూండాల్లా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు.

ఫాస్ట్

రాష్ట్రంలో ఎఫ్​ఏఎస్​టీ(ఫాస్ట్)ను అభివృద్ధి చేయాల్సిన సమయం వచ్చిందన్నారు ప్రధాని. ఎఫ్​- ఫిషరీస్(చేపల పెంపకం), ఏ- అగ్రికల్చర్​(వ్యవసాయం), ఆయుర్వేదం, ఎస్​-స్కిల్​ డెవలప్​మెంట్​(నైపుణ్యాభివృద్ధి), సోషల్​ జస్టిస్​(సామాజిక న్యాయం) అని వివరించారు.

ఆయనే కేరళ అసలైన పుత్రుడు

"మెట్రో మ్యాన్​ శ్రీధరన్​.. దేశ అభివృద్ధి, ఆధునికీకరణకు అద్భుతంగా కృషి చేసిన వ్యక్తి. సమాజంలోని అన్ని వర్గాలవారి ప్రశంసలు పొందిన వ్యక్తి. రాష్ట్ర పురోగతికి తనను తాను అంకితం చేసుకున్నారు. కేరళ నిజమైన పుత్రుడు. ఆయన శక్తికి మించి ఆలోచిస్తారు." అని పేర్కొన్నారు ప్రధాని.

రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు.. భాజపాకు అండగా నిలవాలని కోరారు మోదీ.

ఇదీ చూడండి:నందిగ్రామ్ నాది.. ఇక్కడే ఉంటా: దీదీ

Last Updated : Mar 30, 2021, 1:49 PM IST

ABOUT THE AUTHOR

...view details