LCA Mark 1A Fighter Jet IAF :భారత వైమానిక దళం.. పెద్ద సంఖ్యలో యుద్ధ విమానాల కొనుగోళ్లకు ప్రతిపాదనలను సిద్ధం చేసింది. మిగ్-21 యుద్ధ విమానాల స్థానంలో అదనంగా 100 తేజస్ (ఎల్సీఏ) ఎంకే-1ఏ యుద్ధ విమానాలను కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకుంది. అందుకు సంబంధించిన ప్రతిపాదనలను రక్షణ శాఖకు పంపింది.
LCA Fighter Jet Order : హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) నుంచి 100 తేజస్ మార్క్-1ఏ యుద్ధ విమానాలకు భారత వైమానిక దళం (ఐఏఎఫ్) ఆర్డర్ ఇవ్వనుందని సీనియర్ రక్షణ అధికారులు తెలిపారు. స్వదేశీ ఏరోస్పేస్ పరిశ్రమకు ఊతమిచ్చేలా మిగ్-21 యుద్ధ విమానాల స్థానంలో మరో 100 తేజస్ మార్క్-1ఏ యుద్ధ విమానాలను కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
రూ.66వేల కోట్లకుపైగా..
ఈ 100 తేలికపాటి యుద్ధ విమానాలకు సంబంధించిన ప్రతిపాదనలను రక్షణ మంత్రిత్వ శాఖకు సమర్పించామని.. త్వరలోనే వాటికి ఆమోదం వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ ప్రతిపాదనల విలువ రూ.66వేల కోట్లకుపైగా ఉంటుందని తెలుస్తోంది. ఇటీవలే జరిగిన స్వదేశీ ఫైటర్ జెట్ అభివృద్ధి సమీక్షా సమవేశంలో హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సహా పలు సంస్థలు పాల్గొన్నాయి. ఆ సమయంలో అన్ని సంస్థలతో ఐఏఎఫ్ చీఫ్ వీఆర్ చౌదరి సమీక్షించారు. ఆ సమావేశంలోనే 100 విమానాలను కొనుగోలు చేయాలనే నిర్ణయం తీసుకున్నారు.
రూ.7,800 కోట్ల విలువైన కొనుగోళ్లకు రక్షణ శాఖ పచ్చజెండా
మరోవైపు, ఎంఐ-17 వీ5 హెలికాప్టర్లకు ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ (ఈడబ్ల్యూ) వ్యవస్థలు సహా రూ.7,800 కోట్ల విలువైన కొనుగోళ్ల ప్రతిపాదనలకు రక్షణ శాఖ గురువారం ఆమోదం తెలిపింది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలోని రక్షణ కొనుగోళ్ల మండలి (డీఏసీ) అనుమతించిన కొనుగోళ్లలో 7.6251 ఎంఎం లైట్ మెషిన్‌గన్ (ఎల్‌ఎంజీ), నౌకాదళంలోని ఎంహెచ్-60ఆర్ హెలికాప్టర్లకు ఆయుధాల కొనుగోలు వంటివి ఉన్నాయి. వీటిలో ఈడబ్ల్యూ వ్యవస్థను భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నుంచి సేకరించనున్నారు.
"రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన రక్షణ కొనుగోళ్ల మండలి (డీఏసీ) సమావేశంలో సుమారు రూ.7,800 కోట్ల విలువైన కొనుగోళ్ల ప్రతిపాదనలకు ఆమోదం లభించింది" అని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. భారత వైమానిక దళ సామర్థ్యాన్ని పెంపొందించడానికి డీఏసీ.. ఐడీడీఎం కేటగిరీ కింద ఎంఐ-17 వీ5 హెలికాప్టర్లలో ఎలక్ట్రానిక్ వార్ఫేర్ను(EW) ఇన్‌స్టాలేషన్ చేయడానికి అనుమతిచ్చినిచ్చినట్లు చెప్పింది.
భారత నౌక దళంలోని ఎంహెచ్-60ఆర్ హెలికాప్టర్ల కోసం రక్షణ శాఖ ఆయుధాలు కొనుగోలు చేయనుది. ప్రాజెక్టు శక్తి కింద ఆర్మీ కోసం ప్రత్యేకమైన ల్యాప్‌ట్యాప్‌లు, ట్యాబ్‌లు కొనుగోలుకు డీఏసీ ఆమోదం తెలిపింది. ఆయా ఆయుధాలు, పరికరాలు అన్నింటిని దేశీయ సంస్థల నుంచే కొనుగోలు చేయనుంది.