LB Nagar Murder Case Updates :రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్‌లో సంచలనం సృష్టించిన ప్రేమోన్మాది శివకుమార్ కేసులో(LB Nagar Murder Case Updates) .. పోలీసులు దర్యాప్తులో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. సంఘవి, మృతుడు పృధ్వితేజ్, నిందితుడు శివకుమార్ పదోతరగతి వరకూ ఒకే పాఠశాలలో చదువుకున్నారు. ఇంటర్మీడియట్ చదివేందుకు అక్కాతమ్ముడు మహబూబ్‌నగర్ వెళ్లారు. డాక్టర్ కావాలనుకున్న సంఘవి ఇంటర్ తర్వాత.. నీట్ ర్యాంకు సాధించేందుకు రెండేళ్ల పాటు లాంగ్‌టర్మ్ కోచింగ్ తీసుకుంది. పృధ్వి బీటెక్‌లో చేరాడు.
శివకుమార్ మాత్రం షాద్‌నగర్‌లో డిగ్రీ పూర్తి చేశాడు. 2018లో డిగ్రీ పూర్తి చేసిన శివకుమార్.. మొదటి శ్రేణిలో ఉత్తీర్ణత సాధించాడు. అనంతరం అతనికి సినిమాలపై ఆసక్తి ఉండటంతో.. భవిష్యత్‌పై దృష్టి పెట్టమని శివకుమార్‌ను.. తండ్రి శంకర్ మందలించాడు. దీంతో అతడు సుత్తితో.. తండ్రి తలపై కొట్టడంతో ఆసుపత్రి పాలయ్యాడు. ఈ క్రమంలోనే 10 రోజుల పాటు చికిత్స పొంది శంకర్ మరణించాడు.
ప్రియురాలు, ఆమె తల్లిని కత్తితో పొడిచిన ప్రేమోన్మాది.. అసలేం జరిగిందంటే?
శివకుమార్ భవిష్యత్ కోసం కుటుంబ సభ్యులతో కలిసి ఈ విషయాన్ని గోప్యంగా ఉంచిన గ్రామస్తులు.. అంత్యక్రియలు నిర్వహించారు. అతడి తీరును చూసి.. అక్కడి ప్రజలు నిందితుడిని దూరం పెట్టారు. సినిమాల్లో అవకాశాల కోసం హైదరాబాద్ చూట్టూ తిరుగుతున్న శివకుమార్.. ఓ సినిమాలో సైతం నటించాడు. కాగా కొన్ని నెలల క్రితం పాఠశాలలో గెట్ టూ గెదర్‌లో శివకుమార్, సంఘవిలుమళ్లీ కలుసుకున్నారు. అప్పటి నుంచి.. ఆమెను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానంటూ అతను వెంటపడ్డాడు.
మరోవైపు నీట్ ర్యాంకు రావకపోవడంతో సంఘవి.. రామాంతపూర్‌లోని హోమియోపతి కళాశాలలో చేరింది. ఎల్బీనగర్ ఆర్టీసీ కాలనీలో ఇల్లు అద్దెకు తీసుకుని.. సోదరులు పృద్వి, రోహిత్‌తో పాటు మరో బంధువు శ్రీనివాస్‌తో కలిసి ఉంటోంది. ఈ విషయం తెలిసి శివకుమార్ సైతం రామాంతపూర్‌లో నివాసం ఉంటున్నాడు. జీవితంలో స్థిరపడి సంఘవిని ఒప్పించి వివాహం చేసుకోవాలని.. అతను ఎస్సై ఉద్యోగం కోసం తీవ్రంగా ప్రయత్నించాడు. కానీ ఉద్యోగం రాలేదు.