ముంబయి నగర పోలీసులు కఠిన నిషేధాజ్ఞలు ప్రకటించారు. నవంబర్ 1 నుంచి 15 వరకు నగరంలో నిషేధాజ్ఞలు విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఒకేచోట ఐదుగురికి మించి గుమిగూడటంతో పాటు చట్టవిరుద్ధమైన ఊరేగింపులు, లౌడ్ స్పీకర్ల వాడకం, బాణసంచా కాల్చడం వంటి కార్యకలాపాలపై నిషేధం విధిస్తున్నట్టు తెలిపారు. ముంబయి నగరంలో శాంతిభద్రతలకు విఘాతం, ప్రజల ప్రాణాలు, ఆస్తులకు ముప్పు పొంచి ఉందన్న సమాచారంతో అప్రమత్తమైన పోలీసులు ఈ నిషేధాజ్ఞలు ప్రకటిస్తూ ఉత్తర్వులు వెలువరించారు.
ముంబయిలో హైఅలర్ట్.. వారి ప్రాణాలకు ముప్పు.. 15రోజులు అవన్నీ బంద్
శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందన్న నిఘా వర్గాల సమాచారంతో ముంబయి పోలీసులు అప్రమత్తమయ్యారు. నవంబర్ 1 నుంచి 15 నగరంలో నిషేధాజ్ఞలు విధించారు.
మహారాష్ట్ర పోలీసు చట్టంలోని నిబంధనల ప్రకారం జారీ చేసిన ఈ ఉత్తర్వుల్లో వివాహాలు, అంత్యక్రియలు, క్లబ్బులు, కంపెనీలు, సహకార సంఘాలు, థియేటర్లు, సినిమాహాళ్లలో సమావేశాలకు మాత్రం మినహాయింపు కల్పించారు. అలాగే, ముంబయిలో శాంతిభద్రతలు, ప్రజల భద్రత పరిరక్షించడంలో భాగంగా నవంబర్ 3 నుంచి డిసెంబర్ 2 వరకు ఆయుధాల ప్రదర్శన, మందుగుండు సామగ్రి వినియోగంపైనా నిషేధం విధిస్తూ మరో ఉత్తర్వును విడిగా జారీ చేశారు. సామాజిక నైతికత, భద్రత లేదా ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రమాదానికి దారితీసే ఫొటోలు, సింబల్స్, బోర్డులను రూపొందించడం, ప్రదర్శించడంపైనా నిషేధం విధిస్తున్నట్టు పేర్కొన్నారు. అదే సమయంలో రెచ్చగొట్టే ప్రసంగాలు, పాటలు, సంగీతం వంటి వాటిపైనా నిషేధాజ్ఞలు అమలులలో ఉంటాయని స్పష్టంచేశారు. ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.