కేంద్ర మంత్రివర్గంలో కీలక మార్పులు జరిగాయి. న్యాయశాఖ మంత్రిగా ఉన్న కిరణ్ రిజిజును.. ఆ బాధ్యతల నుంచి తొలగించారు. మరో కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్‌ను నూతన న్యాయశాఖ మంత్రిగా నియమించారు. రిజిజుకు భూవిజ్ఞానశాస్త్ర మంత్రిత్వ శాఖను కేటాయించినట్లు రాష్ట్రపతి భవన్ వెల్లడించింది. ప్రస్తుతం అర్జున్ రామ్ మేఘవాల్.. సాంస్కృతిక శాఖ సహాయ మంత్రిగా, పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రిగా పని చేస్తున్నారు. ఆయనతో పాటు న్యాయ శాఖ సహాయ మంత్రి ఎస్పీ సింగ్ బగేల్‌ను సైతం బాధ్యతల నుంచి తప్పించారు. ఆయనకు ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం శాఖను కేటాయించినట్లు రాష్ట్రపతి భవన్ అధికార ప్రతినిధి తెలిపారు.
సుప్రీం కోర్టుకు లక్ష్మణ రేఖ ఉందని రిజిజు వ్యాఖ్యలు..
గత కొంత కాలంగా న్యాయ వ్యవస్థపై రిజిజు వివాదస్పద వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థ సహా అనేక సంస్థలకు.. రాజ్యాంగ లక్ష్మణ రేఖ ఉందన్నారు. పాలనాపరమైన నియామకాల్లో జడ్జీలు భాగమైతే.. తీర్పులు ఎవరు చెప్పాలని ఆయన ప్రశ్నించారు. న్యాయవ్యవస్థ నుంచి వచ్చిన ఒత్తిడి నేపథ్యంలో తాజా నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాల సమాచారం. న్యాయవ్యవస్థపై రిజిజు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడం ఈ నిర్ణయానికి దారి తీసినట్లు తెలుస్తోంది.
శాఖ మార్పుపై రిజిజు స్పందన..
తన శాఖ మార్చుతున్నట్లు రాష్ట్రపతి నోటిఫికేషన్ వచ్చిన అనంతరం.. రిజిజు తన ట్విట్టర్ బయోను మార్చుకున్నారు. మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్‌ను తొలగించి.. మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్స్ అని మార్చుకున్నారు. దేశ న్యాయశాఖ మంత్రిగా పనిచేసినందకు చాలా గర్వంగా భావిస్తున్నట్లు రిజిజు వెల్లడించారు. ప్రధాని మోదీ తనకు అప్పగించిన తదుపరి బాధ్యతలను సమర్థవంతగా నెరవేరుస్తానని కేంద్ర న్యాయశాఖ మాజీ మంత్రి వెల్లడించారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి, న్యాయమూర్తులకు, హైకోర్టులు ప్రధాన న్యాయమూర్తులకు, మిగతా న్యాయవాదులకు రిజిజు ధన్యవాదాలు తెలిపారు. కిందిస్థాయి న్యాయస్థానాలకు, న్యాయాధికారులకు సైతం ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. పౌరులకు న్యాయసేవలు అందించేందుకు వారేంతో తనకు మద్దతిచ్చారని ఆయన పేర్కొన్నారు. కాగా 2021 జులై 7న రిజిజు కేంద్ర న్యాయశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.