B Tech Student Jeevan Case Updates: ‘నాకు ఇదే చివరి రోజు కావచ్చు’ అని తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ ఇంజినీరింగ్ విద్యార్థి పోస్ట్ పెట్టాడు. దానిని చూసిన స్నేహితుడు వెటకారంగా కామెంటు పెట్టాడు. దానికి బదులుగా ‘రాత్రికి నీకే తెలుస్తుందిలే..’ అని ఇన్‌స్టాలో రిప్లై ఇచ్చాడు. ఇది జరిగిన 8 గంటల్లో పోస్టు నిజమైంది. అది పెట్టిన యువకుడు అనుమానాస్పద స్థితిలో కాలిపోయి విగతజీవిగా కనిపించాడు.
విజయవాడ నగర శివార్లలో ఇంజినీరింగ్ విద్యార్థి నిప్పంటించుకుని మృతి చెందిన ఘటన కలకలం రేపింది. పెనమలూరు మండలం పెదపులిపాక గ్రామ పరిధిలో మృతదేహం మూడొంతులకు పైగా కాలిపోయి, గుర్తించలేని స్థితిలో కనిపించింది. స్థానిక రైతులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. మృతిపై పెనమలూరు పోలీసులు ఆనవాళ్లను బట్టి తొలుత హత్యకేసుగా నమోదు చేశారు. ఆ తర్వాత ఇది ఆత్మహత్య అయ్యి ఉండొచ్చని పోలీసులు అంచనాకు వచ్చినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి..
ఈఎంఐ డబ్బు సొంతానికి వాడుకుని: కృష్ణా జిల్లా పెదపులిపాకలో ఇంజనీరింగ్ విద్యార్థి మరణం కలకలం రేపుతోంది. జమ్ములమూడి జీవన్ (21) నగరంలోని పొట్టి శ్రీరాములు ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ మూడో ఏడాది చదువుతున్నాడు. తల్లిదండ్రులు సుధాకర్, నాగమణి. వీరి స్వగ్రామం తోట్లవల్లూరు మండలం వల్లూరుపాలెం. వీరు కొంతకాలం క్రితం నగరంలోని క్రీస్తు రాజపురం వచ్చి నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు సంతానం. కుమార్తెకు వివాహమైంది. తండ్రి సుధాకర్ ఓ అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మెన్‌గా పని చేస్తున్నాడు. ఇటీవల లోన్ తాలూకూ ఈఎంఐ కట్టమని జీవన్‌కు తండ్రి రూ. 12 వేలు డబ్బులు ఇచ్చాడు. అయితే జీవన్ ఆ డబ్బును వివిధ అవసరాలకు ఖర్చు చేశాడు. ఈ సంగతి తెలిసి రెండు రోజుల క్రితం తండ్రి మందలించాడు. దీంతో మనస్థాపానికి గురై సోమవారం ఇంటి నుంచి వెళ్లిపోయాడు.
స్నేహితుడి ఇంట్లోనే పడుకున్నాడు. తిరిగి మంగళవారం ఇంటికి వచ్చాడు. సాయంత్రం స్నేహితుడి పుట్టిన రోజు పార్టీ ఉందని ఇంట్లో తల్లికి చెప్పి బయటకు వచ్చాడు. ఆ సమయంలో తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో బహుశా.. "ఇదే నా చివరి రోజు" అని పోస్టు పెట్టాడు. దీనిని చూసిన ఓ స్నేహితుడు వెటకారంగా పోస్టు చేశాడు. ‘సరేలే.. ఈరోజు రాత్రికి తెలుస్తుందిలే’ అని అందుకు సమాధానం పెట్టాడు. ఆ తర్వాత.. స్నేహితుడు శ్యామ్ పుట్టిన రోజు సందర్భంగా గురునానక్ కాలనీలోని ఓ హోటల్‌లో జరిగిన పార్టీకి హాజరయ్యాడు. రాత్రి 9 గంటల సమయంలో ఇతను తల్లి నాగమణికి ఫోన్ చేసి మామూలుగానే మాట్లాడాడు. పార్టీ ముగిశాక 11 గంటలకు ఇంటికి రానున్నట్లు తెలిపాడు. పార్టీ అనంతరం స్నేహితులతో కలసి అక్కడే నిద్రపోయారు. హఠాత్తుగా 12.30 గంటల సమయంలో స్నేహితుడిని నిద్రలేపి, ద్విచక్ర వాహనం తాళాలు తీసుకుని బయటకు వచ్చాడు.