Lata Mangeshkar demise: సుప్రసిద్ధ గాయని, దివంగత లతా మంగేష్కర్కు పలు రాష్ట్ర ప్రభుత్వాలు నివాళులు ప్రకటించాయి. ఆమె మృతికి నివాళిగా బంగాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బహిరంగ ప్రదేశాలు, ప్రభుత్వ సంస్థలు, ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద 15 రోజుల పాటు లతా మంగేష్కర్ పాటలను ప్రసారం చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆదేశాలు జారీ చేశారు. లతా మంగేష్కర్ గాత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఆదరించారని దీదీ పేర్కొన్నారు. ఆమె పాటలు విని తాను సైతం మైమరచిపోయానని అన్నారు. బంగాల్ ప్రాంతంతో గాయనికి విడదీయరాని అనుబంధం ఉందని గుర్తు చేశారు.
సంతాప దినాలు
Karnataka Lata Mangeshkar demise: లతా మంగేష్కర్ మృతి పట్ల రెండు రోజుల సంతాప దినాలను ప్రకటిస్తున్నట్లు తెలిపింది కర్ణాటక ప్రభుత్వం. 48 గంటల పాటు జాతీయ పతాకాన్ని అవనతం చేసి ఉంచనున్నారు. ప్రజా వినోద కార్యక్రమాలపై నిషేధం ఉండనుంది. ఈ మేరకు సీఎం బసవరాజ్ బొమ్మై ప్రకటన విడుదల చేశారు.
మరోవైపు, ఉత్తరాఖండ్లో ఒకరోజు సంతాప దినంగా ప్రకటించింది అక్కడి ప్రభుత్వం.
సెలవు
Lata Mangeshkar condolences: మహారాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి 7న సెలవు ప్రకటించింది. గాయని మృతికి సంతాపంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఆమె మరణం సంగీత, కళా రంగానికి తీరని నష్టం కలిగిస్తుందని పేర్కొంది.