Last Date To Update Biometrics For LPG Cylinder :తెలంగాణలో మొన్నటి వరకు రేషన్ కార్డు కలిగిన కుటుంబ సభ్యులు ఈ-కేవైసీ కోసం చౌకధరల దుకాణాల వద్ద బారులుతీరారు. ఇంకా ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు వంటగ్యాస్ కనెక్షన్ కలిగిన వారు కూడా కేవైసీ (నో యువర్ కస్టమర్) డీటెయిల్స్ సమర్పించాల్సి ఉంది. గ్యాస్ కనెక్షన్ కలిగిన వ్యక్తి.. సంబంధిత ఏజెన్సీలో ఆధార్ కార్డుతో వచ్చి వేలిముద్ర వేయాలని (బయోమెట్రిక్) కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది.
జనం పరుగులు..
వాస్తవానికి గతనెల నుంచే ఈ ప్రక్రియ అమల్లోకి వచ్చింది. కానీ, ఎన్నికల నేపథ్యంలో ఎవరూ పట్టించుకోలేదు. ఎన్నికలు పూర్తి కావడంతో రెండుమూడు రోజులుగా వినియోగదారులు ఏజెన్సీల వైపు పరుగులు తీస్తున్నారు. దీపం, ఉజ్వల, సీఎస్‌ఆర్ పథకాలతోపాటు సాధారణ కనెక్షన్‌లు కలిగిన వారు సంబంధిత ఏజెన్సీలో బయోమెట్రిక్ నమోదు చేయాల్సి ఉంటుందని కేంద్రం తెలిపింది. గ్యాస్ సిలిండర్లపై సబ్సిడీ పొందేందుకు.. డిసెంబర్ 31 తేదీలోపు బయోమెట్రిక్ అప్‌డేట్ చేయాలి. కానీ.. చాలా మంది కస్టమర్లకు ఇప్పటికీ ఈ సమాచారం గురించి తెలియదు.
ఎవరి పేరున గ్యాస్ కనెక్షన్ ఉందో.. ఆ వ్యక్తి ఆధార్ కార్డుతో వెళ్లి బయోమెట్రిక్ యంత్రంలో వేలిముద్ర వేయాలి. దీనికోసం ఎలాంటి రుసుమూ చెల్లించాల్సిన పనిలేదు. ఒకవేళ గ్యాస్ కనెక్షన్ పొందిన వ్యక్తి మృతిచెందితే.. రి కుటుంబంలో వేరొకరి పేరు మీదకు కనెక్షన్ మార్చుకోవచ్చు. దీనికోసం గతంలో గ్యాస్ కనెక్షన్ పొందిన పత్రాలు, పాసుపుస్తకం, ఎవరి పేరున మార్చాలి అనుకుంటున్నారో.. వారి ఆధార్, బ్యాంకు ఖాతా, డిపెండెంట్ పత్రాలతో సంబంధిత గ్యాస్ ఏజెన్సీకి వెళ్లాలి.
గ్యాస్ సిలిండర్‌కు ఎక్స్పైరీ డేట్- ఎలా చెక్ చేయాలో తెలుసా?