హజ్-2021 యాత్రకు సంబంధించిన ధరఖాస్తు గడువును ప్రభుత్వం పొడిగించింది. వచ్చే ఏడాది జనవరి 10 వరకు ఈ ప్రక్రియ కొనసాగనుందని కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ తెలిపారు. భక్తులు వచ్చే ప్రదేశాలను(ఎంబార్కేషన్ పాయింట్లు) బట్టి ఖరీదు కూడా తగ్గించినట్లు చెప్పారు.
'హజ్ యాత్రకు వెళ్లేందుకు దరఖాస్తు సమర్పించడానికి ఈరోజు, డిసెంబర్ 10 ఆఖరి రోజు. కానీ, ఆ గడువును 2021, జనవరి 10 వరకు పొడిగించామ'ని హజ్ కమిటీతో భేటీ అనంతరం నఖ్వీ తెలిపారు. వచ్చే ఏడాది జూన్-జులై మధ్య ఈ హజ్ 2021 యాత్ర జరగనుంది. సౌదీ అరేబియా, భారత ప్రభుత్వం నిర్దేశించిన కొవిడ్ మార్గదర్శకాలనుసారం ఈ యాత్ర కొనసాగనుంది.
సౌదీ అరేబియాతో చర్చలు జరిపిన అనంతరం.. ఎంబార్కేషన్ పాయింట్ల ఛార్జీలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నామని నఖ్వీ తెలిపారు. మహమ్మారి దృష్ట్యా కొవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సిందేనని స్పష్టం చేశారు.
"వయో పరిమితులు విధించే అవకాశం ఉంది. ప్రతి యాత్రికుడు 72 గంటల ముందే కచ్చితంగా కొవిడ్ పరీక్ష చేయించుకోవాలి. పరీక్షల్లో నెగెటివ్ వచ్చిన వారికే యాత్రకు అనుమతి ఉంటుంది."