బిహార్లోని వైశాలి జిల్లాలో ఉన్న ఓ ఉన్నత పాఠశాలను మద్యం సీసాలను నిల్వ ఉంచే గోదాముగా మార్చింది లిక్కర్ మాఫియా. సమచారం అందుకున్న పోలీసులు.. వెంటనే స్కూల్కు చేరుకుని ఓ గదిలో ఉన్న 140 బాక్సుల విదేశీ మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు.
పోలీసుల వివరాల ప్రకారం.. జిల్లాలోని లాల్గంజ్ పోలీస్స్టేషన్ పరిధికి చెందిన బృందావన్ గ్రామంలో ఉన్న రామరాతి ఉన్నత పాఠశాలలోని ఓ గదిలో అక్రమంగా తరలిస్తున్న విదేశీ మద్యాన్ని నిల్వ ఉంచింది లిక్కర్ మాఫియా. అందుకోసం ఆ గదికి పాఠశాల యాజమాన్యం వేసిన తాళాన్ని పగలగొట్టి తమ కొత్త తాళాన్ని వేశారు స్మగ్లర్లు. అయితే హైస్కూల్ ఉపాధ్యాయుడు ఆదేశ్పాల్.. బుధవారం ఉదయం పాఠశాలకు వచ్చాక ఆ గదిని తెరవడానికి వెళ్లగా.. కొత్త తాళం ఉండటాన్ని గమనించారు.