తెలంగాణ

telangana

ETV Bharat / bharat

జాబ్ స్కామ్​ కేసులో మాజీ సీఎంపై CBI ప్రశ్నలు.. విపక్షాలు లేఖ రాసిన మరుసటిరోజే..

రైల్వే ఉద్యోగాల కుంభకోణం కేసులో బిహార్ మాజీ సీఎం రబ్రీదేవిని సీబీఐ ప్రశ్నించింది. ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేసినట్లు తెలిపింది. రాజ్యాంగ సంస్థల దుర్వినియోగంపై విపక్షాలు లేఖ రాసిన మరుసటి రోజే ఈ ఘటన జరగడంపై కేజ్రీవాల్ తీవ్రంగా స్పందించారు.

land-for-jobs-scam
land-for-jobs-scam

By

Published : Mar 6, 2023, 2:21 PM IST

ఉద్యోగాల కుంభకోణం కేసులో బిహార్‌ మాజీ సీఎం రబ్రీదేవిని ఆమె నివాసంలో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) అధికారుల బృందం ప్రశ్నించింది. రబ్రీదేవి వాంగ్మూలాన్ని నమోదు చేశామని.. ఆమె నివాసంలో ఎలాంటి సోదాలు నిర్వహించడం లేదని సీబీఐ అధికారులు స్పష్టం చేశారు. రబ్రీదేవి అపాయిట్‌మెంట్‌ తీసుకున్న తర్వాతే ఆమెను ప్రశ్నించినట్లు సోమవారం వెల్లడించారు. రాజ్యాంగ సంస్థలను కేంద్రంలోని భాజపా ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని ఎనిమిది ప్రతిపక్ష పార్టీలు లేఖ రాసిన మరుసటి రోజే రబ్రీదేవి నివాసానికి సీబీఐ అధికారులు రావడంపై ఆర్జేడీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మోదీకి రాసిన లేఖపై బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ కూడా సంతకం చేశారని అందుకే కేంద్రం కక్ష సాధింపులకు పాల్పడుతోందని విమర్శించారు.

రబ్రీదేవి నివాసానికి సీబీఐ అధికారుల బృందం వెళ్లడాన్ని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ ఖండించారు. సీబీఐ అధికారుల చర్య రబ్రీదేవిని అవమానపరచడమే అని వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం సీబీఐ, ఈడీ, గవర్నర్‌లతో ఇబ్బందులు పెడుతూ ప్రజా ప్రభుత్వాన్ని పని చేయనివ్వడం లేదని కేజ్రీవాల్‌ ఆరోపించారు. అందరూ కలిసి పనిచేస్తేనే ప్రజాస్వామ్యం ముందుకు సాగుతుందన్నారు. తేజస్వి యాదవ్‌పై ఒత్తిడి తీసుకురావడానికే కేంద్రం సీబీఐ దాడులు చేయిస్తోందని సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ ఆరోపించారు.

రబ్రీదేవి నివాసం ఎదుట సీబీఐ అధికారి, భద్రతా సిబ్బంది

కేసు ఏంటంటే?
లాలుప్రసాద్‌ యాదవ్‌ రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో రైల్వేల్లో గ్రూప్-డీ ఉద్యోగాలు ఇప్పించి.. ఆ డబ్బుతో భూమిని కొనుగోలు చేశారని సీబీఐ అభియోగ పత్రం దాఖలు చేసింది. పట్నా జోన్​కు చెందిన కొందరికి ముంబయి, కోల్​కతా, జబల్​పుర్, జైపుర్ వంటి జోన్లలో ఉద్యోగాలు ఇప్పించారని ఆరోపించింది. ఇందుకు బదులుగా ఆ అభ్యర్థులు, వారి కుటుంబ సభ్యులు తమ భూములను లాలూ ప్రసాద్​కు, ఏకే ఇన్ఫోసిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి బదిలీ చేశారని సీబీఐ చెబుతోంది. ఈ కేసులో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం లాలూ ప్రసాద్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులకు సమన్లు జారీ చేసింది. ఈ కేసుపైనే రబ్రీదేవిని సీబీఐ విచారిస్తోంది. దీనిపై అదనపు సమాచారం కోసం తాజాగా రబ్రీదేవి ఇంటికి వెళ్లినట్లు సీబీఐ వర్గాలు చెబుతున్నాయి.

లేఖ రాసిన తర్వాతనే..
విపక్షాలపై కేంద్రం కక్షగట్టి దర్యాప్తు సంస్థలను ఎగదోస్తోందన్న ఆరోపణల మధ్య సీబీఐ రబ్రీదేవి ఇంటికి వెళ్లడం గమనార్హం. దర్యాప్తు సంస్థలు కేంద్ర ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మగా మారాయంటూ ఆరోపిస్తూ ఆదివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తొమ్మిది విపక్ష పార్టీల నేతలు లేఖ రాశారు. ఇది ప్రజాస్వామ్యానికి ఏమాత్రం మంచిది కాదంటూ హితవు పలికాయి. ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే దేశం ప్రజాస్వామ్యం నుంచి నిరంకుశత్వం వైపు పయనిస్తోందన్న అనుమానాలు కలుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశాయి. ఈ లేఖపై తెలంగాణ సీఎం కేసీఆర్, దిల్లీ సీఎం కేజ్రీవాల్, బంగాల్ సీఎం మమతా బెనర్జీ సైతం చేశారు. శరద్ పవార్, ఫరూక్ అబ్దుల్లా, అఖిలేశ్ యాదవ్, ఉద్ధవ్ ఠాక్రే, తేజస్వి యాదవ్, భగవంత్ మాన్​లు సంతకాలు చేసినవారిలో ఉన్నారు.

ABOUT THE AUTHOR

...view details