Lalu Prasad son in law: బిహార్ ప్రభుత్వ అధికారిక సమావేశాల్లో లాలూ అల్లుడు పాల్గొనడం కొత్తగా ఏర్పడిన కూటమిని తీవ్ర ఇబ్బందుల్లో పడేసింది. లాలూ పెద్ద కుమారుడు, అటవీ శాఖ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్.. ఏర్పాటు చేసిన మీటింగ్లో ఆయన బావ పాల్గొనడంపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ఈనెల 17న ఏర్పాటు చేసిన కాలుష్య నియంత్రణ మండలి అధికారుల సమావేశానికి మంత్రి తేజ్ ప్రతాప్ హాజరయ్యారు. ఆయనతో పాటు.. తన సోదరి మిసా భారతి భర్త శైలేశ్ కుమార్ కూడా సమావేశానికి హాజరయ్యారు. కుమార్.. ఎంపీలు కూర్చునే సీట్లకు వెనుక వరుసలో కూర్చొని కనిపించారు. మరుసటి రోజు ఏర్పాటు చేసిన అదే సమావేశంలో శైలేశ్ తన బావమరిది మంత్రి తేజ్ ప్రతాప్ పక్కనే కూర్చొని కనిపించారు. ఈ ఘటనపై భాజపా తీవ్ర విమర్శలు చేసింది.
"ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలిచే తేజ్ ప్రతాప్.. తన అధికార బాధ్యతలను తన బావకు అందించే ప్రయత్నం చేస్తున్నట్లు ఉంది. లాలూ అల్లుడు కేవలం సమావేశాలకు మాత్రమే హాజరుకాలేదు.. తనకు సంబంధంలేని సమావేశాలను ఆయనే దగ్గరుండి నిర్వహిస్తున్నారు. లాలూ.. కుటుంబ రాజకీయాలు చేస్తున్నారు. దీనిపై బిహార్ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపై ఉంది. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వంలో నేర చరిత్ర కలిగిన మంత్రులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. రాష్ట్రంలో గూండాల రాజ్యం వస్తుందనడానికి ఇవే సూచనలు. లాలూ అల్లుడు ప్రభుత్వ్ సమావేశాల్లో పాల్గొన్న సంఘటనే దానికి ఉదాహరణ."
-సుశీల్ కుమార్ మోదీ, రాష్ట్ర భాజపా నాయకుడు
నోరు విప్పని ఆర్జేడీ: కాలుష్య నియంత్రణ మండలి ఏర్పాటు చేసిన రెండు సమావేశాలకు శైలేష్ కుమార్ ఎందుకు హాజరయ్యారనేది.. స్పష్టంగా తెలిసిన తర్వాతే స్పందిస్తామని అధికార పార్టీ వర్గాలు తెలిపాయి. కాగా ఈ వీడియోపై ఆర్జేడీ నాయకులు నోరు విప్పడంలేదు.