Lalu Prasad Yadav Health Update: దిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చారు ఆయన తనయుడు తేజస్వీ యాదవ్. లాలూ ఆరోగ్య పరిస్థితి మునుపటి కంటే మెరుగ్గా ఉందని గురువారం రాత్రి తేజస్వీ చెప్పారు. ఇంటెన్సివ్ కేర్‌లో వైద్యుల పర్యవేక్షణలో లాలూ ఉన్నారన్న తేజస్వీ.. సోషల్ మీడియాలో వస్తున్న ఊహాగానాలను నమ్మవద్దని ప్రజలను కోరారు.
"నాన్న ఆరోగ్యం క్రమక్రమంగా మెరుగపడుతోంది. గురువారం కిచిడీ తిన్నారు. కుటుంబసభ్యులతో మాట్లాడారు. కేవలం పడుకున్నప్పుడే మాత్రమే ఆక్సిజన్ సపోర్టు ఇస్తున్నారు డాక్టర్లు. త్వరలోనే ఐసీయూ నుంచి జనరల్ వార్డుకు తరలించే అవకాశం ఉంది"
-- తేజస్వీ యాదవ్, లాలూ కుమారుడు
'సపోర్ట్‌తో నిల్చుంటున్న లాలూ'.. దిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న లాలూ తాజా ఫోటోలను ఆయన కుమార్తె మిసా భారతి ట్విట్టర్లో షేర్ చేశారు. "ప్రస్తుతం లాలూజీ బెడ్‌పై కూర్చోగలుగుతున్నారు. సపోర్ట్‌తో నిలబడుతున్నారు. క్రమక్రమంగా ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతోంది" అంటూ ఆమె ట్వీట్ చేశారు.
ఆసుపత్రిలో కూర్చున్న లాలూ 'మందులు అధిక మొత్తంలో ఇవ్వడం వల్లే..' అయితే అంతకుముందు.. మందులు అధిక మోతాదులో ఇవ్వడం వల్ల లాలూ పరిస్థితి మరింత దిగజారిందని తేజస్వీ యాదవ్ వెల్లడించారు. లాలూ శరీరంలో కదలికలు లేవని తెలిపారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంటే సింగపూర్‌కు తరలించాలని అనుకుంటున్నట్లు చెప్పారు. కానీ ప్రస్తుతం ఆరోగ్యం క్షీణించడం వల్ల మరో రెండు నుంచి నాలుగు వారాల సమయం పట్టే అవకాశం ఉందని తెలిపారు.
మెట్లపై నుంచి జారిపడి.. జులై 3న లాలూప్రసాద్ యాదవ్ గాయపడ్డారు. పట్నాలోని తన సతీమణి రబ్రీదేవి నివాసంలో ఉంటున్న ఆయన.. మెట్లు ఎక్కుతుండగా జారిపడ్డారు. ఈ క్రమంలో ఆయన భుజం విరిగింది. పట్నాలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన్ను.. బుధవారం రాత్రి ఎయిర్ అంబులెన్స్‌లో అత్యవసర చికిత్స కోసం దిల్లీ ఎయిమ్స్‌కు తరలించారు. అంతే కాకుండా లాలూ కొంతకాలంగా కిడ్నీ, హృదయ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే కిడ్నీ సమస్య చికిత్స కోసం విదేశాలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. దీని కోసం కోర్టు నుంచి సైతం అనుమతి తీసుకున్నారు.
ఐదేళ్లు జైలు శిక్ష విధించిన సీబీఐ కోర్టు.. దాణా కుంభకోణం కేసులో ఆర్జేడీ అధినేత, బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌కు ఇప్పటికే శిక్ష ఖరారైంది. రాంచీలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఆయనకు ఐదేళ్లు జైలు శిక్ష, రూ.60 లక్షలు జరిమానా విధిస్తున్నట్లు ఫిబ్రవరి 21న తీర్పు వెలువరించింది. దాణా కుంభకోణానికి సంబంధించి ఇప్పటికే నాలుగు కేసుల్లో లాలూ దోషిగా తేలారు. దోరండా ఖజానా నుంచి రూ.139.35కోట్లు దుర్వినియోగం కేసు ఐదోది, చివరిది.
ఇవీ చదవండి: