Lalu Prasad Yadav Car Driving: ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ డ్రైవర్‌గా మారారు. పార్టీ కార్యకర్తలతో కలిసి పట్నా వీధుల్లో షికారు చేశారు. తనకు ఆరోగ్యం క్షీణించినా.. ఇప్పటికీ రాజకీయంగా తాను డ్రైవింగ్ సీట్లోనే ఉన్నాననే సందేశాన్ని కార్యకర్తలకు పంపారు. మాజీ ముఖ్యమంత్రి, లాలూ ప్రసాద్ యాదవ్ భార్య అయిన రబ్రీదేవికి పట్నాలో కేటాయించిన బంగ్లాకు చుట్టు పక్కల ఉన్న వీధుల్లో ఓపెన్ టాప్ జీపును నడిపారు లాలూ.
ఎన్నో ఏళ్ల తరువాత జీపు ఎక్కిన లాలూ... వాహనాన్ని రివర్స్‌లో నడిపారు. ఈ క్రమంలో అక్కడ ఉన్న భద్రతా సిబ్బంది ఒకింత ఆందోళనకు గురైనా.. ఆయన మాత్రం తన డ్రైవింగ్‌ను (lalu driving news) ఎంజాయ్ చేశారు. లాలూ ఓ ప్రాంతానికి చేరుకోగానే ఆయనను చూసి ఆశ్చర్యానికి గురైన ప్రజలు.. 'లాలూ యాదవ్ జిందాబాద్' అని నినాదాలు చేస్తూ మద్దతు తెలిపారు. ఈ వీడియోను తన ట్విట్టర్లో షేర్ చేశారు లాలూ.
"చాలా ఏళ్ల తరువాత నా మొదటి వాహనం నడిపాను. ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరూ ఏదో ఒక విషయంలో డ్రైవర్‌గా మారుతారు. ప్రేమ, సామరస్యం, సమానత్వం, శ్రేయస్సు, సహనం, న్యాయం లాంటి వాటిని మోసుకెళ్లే జీవితం అనే కారు ప్రయాణం కూడా సాఫీగా సాగాలి."