Lalitpur minor rape: ఉత్తర్ ప్రదేశ్‌లోని లలిత్‌పుర్ జిల్లాలో దారుణం జరిగింది. బాలికపై ఆరుగురు అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితుల్లో పోలీస్ ఇన్‌స్పెక్టర్ ఉన్నాడు. ఈ ఘటనపై జిల్లా ఎస్పీ విచారణకు ఆదేశించారు. ఏప్రిల్ 22వ తేదీన మైనర్ బాలికను భోపాల్ తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారని బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
అసలేం జరిగిందంటే: పాలీ రైల్వే స్టేషన్ సమీపంలోనే బాధితురాలిని ఉంచిన ముగ్గురు నిందితులు వరుసగా మూడు రోజులు అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం బాధితురాలిని పాలీ పోలీస్ స్టేషన్ సమీపంలో ఏప్రిల్ 26న వదిలి వెళ్లిపోయారు. బాధితురాలిని వాంగ్మూలం తీసుకున్న పాలీ పోలీసులు.. బాలికను ఆమె అత్తతో పంపించేశారు.
ఏప్రిల్ 27వ తేదీన బాధితురాలిని వాంగ్మూలం నిమిత్తం పోలీస్ స్టేషన్‌కు పిలిచారు పాలీ ఇన్‌స్పెక్టర్. ఆరోజు సాయంత్రం స్టేషన్‌లోని ఓ గదిలోనే ఇన్‌స్పెక్టర్ బాధితురాలిపై అత్యాచారం చేశాడు. అనంతరం బాధితురాలిని ఆమె అత్తకు అప్పగించాడు.
ఏప్రిల్ 30న చైల్డ్ లైన్‌కు బాధితురాలిని అప్పగించారు కుటుంబ సభ్యులు. బాలికకు కౌన్సెలింగ్ ఇవ్వగా.. జరిగిన దారుణమంతా చెప్పింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితులందరిపై కేసు నమోదు చేయాలని జిల్లా ఎస్పీ పోలీసులను ఆదేశించారు. ఎస్పీ ఆదేశాల మేరకు చందన్, రాజ్‌భాన్, హరిశంకర్, మహేంద్ర చౌరాసియా, ఇన్‌స్పెక్టర్ తిలక్‌ధారి సరోజ్, గులాబ్బాయి అహిర్వార్‌పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.