కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై తీవ్ర విమర్శలు చేశారు ఐపీఎల్ ఫౌండర్ లలిత్ మోదీ. గురువారం వరుస ట్వీట్లతో రాహుల్, ఆయన అనుచరుపై విరుచుకుపడ్డారు. 'బ్యాగ్ మెన్', చట్టం నుంచి తప్పించుకుని తిరుగుతున్నారంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యలపై ఆయనను బ్రిటన్ కోర్టుకు లాగుతానని హెచ్చరించారు. దేశంలో ప్రతిపక్ష నేతలు సరైన అవగాహన లేకుండా తనపై ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.
"రాహుల్ సహా ఆయన అనుచరులు అనేక మంది నేను చట్టం నుంచి తప్పించుకుని తిరుగుతున్నానని అంటున్నారు. ఎందుకు అలా పిలుస్తున్నారు? ఇప్పటివరకు నేను ఏ కేసులోనైనా దోషినని తీర్పు వచ్చిందా? పప్పు అలియాస్ రాహుల్ గాంధీలా కాకుండా.. నేను ఓ సాధారణ పౌరుడిని. ప్రతిపక్ష నాయకులు ఏ సమాచారం లేకుండా కక్ష సాధించేందుకే నాపై ఆరోపణలు చేస్తున్నారు. రాహుల్ గాంధీని బ్రిటన్ కోర్టుకు లాగాలని నిర్ణయించుకున్నాను. ఆయన స్పష్టమైన ఆధారాలతో కోర్టు ముందుకు రావాల్సి ఉంటుంది. ఆయన తనను తాను పరిపూర్ణ మూర్ఖుడిగా మారడాన్ని చూడాలని నేను ఎదురు చూస్తున్నాను. గాంధీ కుటుంబం తరఫున సంచులు మోసే ఆర్‌కే ధావన్, మోతీలాల్ వోరా, సీతారామ్ కేసరి, నారాయణ్ దత్ తివారీ, సతీశ్ శర్మ వంటివారికి విదేశాల్లో ఆస్తులు ఎలా వచ్చాయో.. కమల్‌నాథ్‌ను అడగండి."
-- లలిత్ మోదీ, ఐపీఎల్ ఫౌండర్
"నిజమైన అవినీతిపరుల చిరునామాలు, ఫొటోలను పంపిస్తాను. మనం భారతీయులను వెర్రివాళ్లను చేయవద్దు. దేశాన్ని పరిపాలించే అర్హత తమకు మాత్రమే ఉందన్నట్లుగా గాంధీ కుటుంబం చేస్తోంది. మీరు కఠినమైన చట్టాలను చేసినపుడు నేను కచ్చితంగా భారత్‌కు తిరిగి వస్తాను. జై హింద్" అని మరొక ట్వీట్‌లో లలిత్ మోదీ పేర్కొన్నారు.