తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'అనర్హత' కేసులో మహ్మద్​ ఫైజల్​కు సుప్రీంకోర్టు కీలక ప్రశ్న - లక్షద్వీప్ ఎంపీ మహ్మద్ ఫైజల్

లక్షద్వీప్​కు చెందిన ఎన్​సీపీ నేత మహ్మద్​ ఫైజల్​ అనర్హత వ్యవహారం సుప్రీంకోర్టులో మంగళవారం ప్రస్తావనకు వచ్చింది. లోక్​సభ సభ్యత్వాన్ని పునరుద్ధరించకపోవడం వల్ల ఏ ప్రాథమిక హక్కుకు భంగం కలిగిందని ఈ సందర్భంగా కోర్టు ప్రశ్నించింది. ఈ కేసుపై వాదనలు బుధవారం వింటామని స్పష్టం చేసింది.

FAIZAL CASE SUPREME COURT
FAIZAL CASE SUPREME COURT

By

Published : Mar 28, 2023, 3:40 PM IST

Updated : Mar 28, 2023, 3:59 PM IST

లోక్​సభ సభ్యత్వాన్ని పునరుద్ధరించకపోవడం వల్ల ఏ ప్రాథమిక హక్కు ఉల్లంఘనకు గురైందని లక్షద్వీప్​కు చెందిన ఎన్​సీపీ నేత మహ్మద్​ ఫైజల్​ను సుప్రీంకోర్టు ప్రశ్నించింది. హత్యాయత్నం కేసులో ఫైజల్​ను దోషిగా తేల్చడంపై స్టే విధించినా.. లోక్​సభ సభ్యత్వాన్ని పునరుద్ధరించకపోవడం ఆయన దాఖలు చేసిన వ్యాజ్యం సర్వోన్నత న్యాయస్థానంలో మంగళవారం ప్రస్తావనకు వచ్చింది. ఫైజల్ తరఫు న్యాయవాది ఈ కేసుపై విచారణ చేపట్టాలని కోరగా.. జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ బీవీ నాగరత్నతో కూడిన ధర్మాసనం స్పందించింది. ఏ ప్రాథమిక హక్కుకు భంగం వాటిల్లిందని ప్రశ్నించింది.

"నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించే హక్కును లాగేసుకున్నారు. ఇలా చేయడం నిబంధనలకు విరుద్ధం" అని ఫైజల్ తరఫు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి సమాధానమిచ్చారు. స్పందించిన ధర్మాసనం.. ఈ విషయంలో హైకోర్టును ఎందుకు ఆశ్రయించలేదని ప్రశ్నించింది. సుప్రీంకోర్టు ఇప్పటికే సంబంధిత కేసును విచారించినందున.. మళ్లీ సర్వోన్నత న్యాయస్థానంలోనే వ్యాజ్యం వేసినట్లు ఫైజల్ తరఫు న్యాయవాది ఏఎం సింఘ్వి వివరించారు. ఈ వ్యాజ్యంపై బుధవారం విచారణ చేపట్టేందుకు న్యాయస్థానం అంగీకరించింది. ఇప్పటికే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ లోక్​సభ సభ్యత్వం రద్దుపై దేశవ్యాప్తంగా దుమారం చెలరేగుతున్న నేపథ్యంలో ఈ కేసు విచారణకు రావడం ఆసక్తికరంగా మారింది.

ఏంటీ ఫైజల్ కేసు?
మహ్మద్ ఫైజల్.. లక్షద్వీప్ లోక్​సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించేవారు. 2009లో కాంగ్రెస్ నాయకుడు మహ్మద్ సలీహ్​పై దాడి చేశారన్న కేసులో 2023 జనవరి 10న ఫైజల్​ను కవరత్తీ సెషన్స్ కోర్టు దోషిగా తేల్చింది. పది ఏళ్లు కఠిన కారాగార శిక్ష విధించింది. తీర్పు వెలువడిన మూడు రోజుల తర్వాత (జనవరి 13న) లోక్​సభ సెక్రెటేరియట్ ఆయనపై అనర్హత వేటు వేస్తూ ప్రకటన జారీ చేసింది. అయితే, తనను దోషిగా తేల్చడాన్ని వ్యతిరేకిస్తూ కేరళ హైకోర్టులో పిటిషన్ వేశారు ఫైజల్. దీనిపై విచారణ జరిపిన కేరళ హైకోర్టు.. కవరత్తీ సెషన్స్ కోర్టు తీర్పు అమలును నిలిపివేసింది. దీంతో ఆయనపై పడిన అనర్హత వేటు చెల్లుబాటు కాకుండా పోయింది. అయినప్పటికీ.. ఫైజల్ సభ్యత్వాన్ని లోక్​సభ పునరుద్ధరించలేదు. దీన్ని సవాల్ చేస్తూ ఆయన సుప్రీంను ఆశ్రయించారు.

రాహుల్​పై కూడా అనర్హత వేటు
2019 లోక్‌సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా కర్ణాటక కోలార్‌లో రాహుల్‌ 'దొంగలందరికీ మోదీ అనే ఇంటిపేరే ఎందుకు ఉంటుందో?' అని వ్యాఖ్యానించారంటూ గుజరాత్‌ భాజపా ఎమ్మెల్యే పూర్ణేశ్‌ మోదీ గుజరాత్​లోని సూరత్‌ న్యాయస్థానంలో పరువునష్టం దావా వేశారు. ఈ కేసును విచారించిన సూరత్ కోర్టు రాహుల్ గాంధీని దోషిగా తేల్చుతూ రెండేళ్ల జైలు శిక్షను విధించింది. కోర్టు ఇచ్చిన ఈ తీర్పును ఆధారంగా చేసుకుని లోక్​సభ సచివాలయం రాహుల్​పై అనర్హత వేటు వేసింది.

Last Updated : Mar 28, 2023, 3:59 PM IST

ABOUT THE AUTHOR

...view details