లఖింపుర్ ఖేరి హింసాత్మక ఘటన(Lakhimpur Kheri Incident) కేసులో మరో ఇద్దరిని ఉత్తర్‌ప్రదేశ్ పోలీసు ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) అరెస్టు చేసింది. నిందితులను రంజిత్ సింగ్, అవతార్ సింగ్‌గా అధికారులు గుర్తించారు. అక్టోబరు 3న రైతులపై ఎస్యూవీ వాహనం దూసుకెళ్లి.. నలుగురు రైతులు మరణించిన తర్వాత.. ఇద్దరు భాజపా కార్యకర్తలు, ఓ డ్రైవర్, ఓ స్థానిక విలేకరిపై వీరు దాడులకు(Lakhimpur Kheri Incident) పాల్పడినట్లు అధికారులు చెప్పారు.
టికోనియా పోలీస్ స్టేషన్లో నిందితులపై రెండో ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటివరకు రెండో ఎఫ్ఐఆర్ కింద నలుగురిని అరెస్టు చేసినట్లు చెప్పారు. విచిత్రా సింగ్, గుర్విందర్ సింగ్‌ను ఇదివరకే అరెస్టు చేసి, జైలుకు తరలించినట్లు చెప్పారు.
నిందితులు రంజిత్ సింగ్, అవతార్ సింగ్‌ను న్యాయస్థానం ముందు హాజరుపరుస్తామని సీనియర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎస్పీ యాదవ్ తెలిపారు. న్యాయస్థానం వారికి జ్యుడిషియల్ కస్టడి విధించే అవకాశం ఉందని చెప్పారు.