లఖింపూర్ ఖేరి ఘటనపై దర్యాప్తు పర్యవేక్షణ బాధ్యతలను ఓ విశ్రాంత న్యాయమూర్తికి సుప్రీంకోర్టు అప్పగించింది. పంజాబ్-హరియాణా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రాకేశ్ కుమార్ జైన్ ఈ కేసు దర్యాప్తును పర్యవేక్షిస్తారని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశాలు జారీచేసింది.
లఖింపూర్ ఖేరి ఘటనపై దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందంలో ఉత్తర్‌ప్రదేశ్ కేడర్‌కు చెందిన ముగ్గురు ఐపీఎస్ అధికారులను సుప్రీంకోర్టు చేర్చింది. వారు ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందినవారు కానందున దర్యాప్తు బృందంలో నియమిస్తున్నట్లు స్పష్టం చేసింది. సిట్ విచారణ పూర్తిచేసి స్థాయీ నివేదిక సమర్పించిన తర్వాత ఈ కేసు విచారణను.. మరోసారి చేపడతామని సుప్రీం ధర్మాసనం ప్రకటించింది.