ఉత్తర్ప్రదేశ్ లఖింపుర్ ఖేరీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ట్రక్కు, ప్రైవేటు బస్సు ఢీకొనడం వల్ల ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఖరిమా పోలీస్ స్టేషన్ పోస్ట్ సమీపంలోని శారదా నది వంతెనపై ఈ ప్రమాదం జరిగింది. బస్సులో 50 మంది వరకు ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. మృతులంతా బస్సులో ఉన్నవారేనని సమాచారం. ప్రమాదంలో అనేక మంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు. ఇందులో 24 మంది పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు.
బస్సు, ట్రక్కు ఢీ.. 8 మంది మృతి.. మరో 24 మంది పరిస్థితి విషమం - lakhimpur accident
యూపీలో ట్రక్కు, బస్సు ఢీకొట్టిన ఘటనలో ఎనిమిది మంది మరణించారు. అనేక మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో 24 మంది పరిస్థితి విషమంగా ఉంది.
'దసరా నేపథ్యంలో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంది. బస్సులో సుమారు 50 మంది ప్రయాణిస్తున్నారు. బస్సు ధౌరాహరా నుంచి లఖింపుర్ ఖేరికి వస్తోంది.. లఖింపుర్ నుంచి భరూచ్కు వెళ్తున్న ట్రక్కును బస్సు ఢీకొట్టింది. ఉదయం 7.30 గంటలకు ఈ ప్రమాదం జరిగింది' అని పోలీసులు తెలిపారు. ఘటన గురించి సమాచారం అందగానే పెద్ద సంఖ్యలో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. జిల్లా మేజిస్ట్రేట్ మహేంద్ర బహదూర్ సింగ్ సహాయక చర్యలను పర్యవేక్షించారు.
యోగి విచారం..
ఈ ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. ప్రమాదంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని జిల్లా అధికారులను ఆదేశించారు.