ఉత్తర్‌ప్రదేశ్ లఖింపుర్ ఖేరిలో జరిగిన హింసాత్మక ఘటనలో(lakhimpur kheri news) ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా.. పోలీసుల ఆదేశాలను విస్మరించారు. ఈ కేసు విచారణలో భాగంగా శుక్రవారం ఉదయం 10 గంటలకు హాజరుకావాలని ఆదేశించగా.. ఉదయం 11.30 గంటలు దాటినా పోలీసుల ముందుకు రాలేదని అధికారులు తెలిపారు.
ఆశిష్ మిశ్రాను ప్రశ్నించేందుకు ఈ కేసు(Lakhimpur Kheri violence) దర్యాప్తు చేపబుడుతున్న డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఉపేంద్ర అగర్వాల్ ఇప్పటికే లఖింపుర్ చేరుకుని వేచిచూస్తున్నట్లు చెప్పారు.
ఈ క్రమంలోనే సంయుక్త కిసాన్ మోర్చ ఓ ప్రకటన చేసింది.
'ఇప్పటికీ అతని(ఆశిష్ మిశ్రా) జాడ లేదు. పరారీలో ఉన్నాడని, అతని కోసం యూపీ పోలీసులు బృందాలు వెతుకుతున్నాయని పలు మీడియా సంస్థలు పేర్కొన్నాయి. ఇప్పటి వరకు మిశ్రాను అరెస్ట్ చేయకపోవటం ఆశ్చర్యంగా ఉంది '
- సంయుక్త కిసాన్ మోర్చ
నేపాల్‌కు పరార్!
మరోవైపు.. మిశ్రా కోసం దర్యాప్తు అధికారులు వేచి చూస్తున్న క్రమంలో అతను నేపాల్ పారిపోయాడని వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ విమర్శలు గుప్పించారు. ' పరారీలో ఉన్నది నిజమే అయితే.. కేంద్రం కలుగజేసుకుని నిందితుడిని అరెస్ట్ చేసి నేపాల్ నుంచి రప్పించాలి. ' అని డిమాండ్ చేశారు.
మరోమారు సమన్లు..
పోలీసుల ముందు ఆశిష్ మిశ్రా హాజరకానందున మరోమారు సమన్లు జారీ చేశారు అధికారులు. శనివారం ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన నివాసం వద్ద నోటీసులు అంటించారు. శనివారం విచారణకు హాజరుకాకుంటే చట్టపరమైన చర్యలు ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరించారు.
అలా.. చర్యలు తీసుకోలేం: యూపీ సీఎం
ఈ కేసులో ఎవరితోనూ అన్యాయం జరగదని, ఒత్తిడితో ఎలాంటి చర్యలు తీసుకోలేమని స్పష్టం చేశారు ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాను అరెస్ట్ చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్న క్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు యోగి. ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోవటం దురదృష్టకరమన్నారు. ఘటనపై పూర్తి వివరాలు తెలుసుకునేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు. ' ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదు. ప్రతిఒక్కరికి చట్టం హామీ ఇస్తున్నప్పుడు, దానిని ఒక్కరి చేతికి ఇవ్వాల్సిన అవసరం లేదు. వీడియో ఆధారాలు ఉంటే అందించాలి. ఎవరితోనూ అన్యాయం జరగదు. చట్టాన్ని ఒక్కరి చేతిలోకి తీసుకోనివ్వం. ఆరోపణలతో ఎవరినీ అరెస్ట్ చేయం. అయితే.. నేరం చేసినట్లు తేలితే అది ఎవరైనా తప్పించుకోలేరు. ' అని పేర్కొన్నారు.
ఆరోగ్య సమస్యలతోనే..
ఆరోగ్య సమస్యల కారణంగా శుక్రవారం తన కుమారుడు విచారణకు హాజరుకాలేకపోయాడని, శనివారం పోలీసుల ముందుకు వస్తాడని చెప్పారు కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా.
కేసు ఏమిటి?
నూతన వ్యవసాయ చట్టాల రద్దు కోరుతూ.. అక్టోబర్ 3న లఖింపుర్ ఖేరిలో (Lakhimpur Kheri Incident) ఆందోళన చేస్తున్న రైతులపైకి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా కారు, మరో వాహనం దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు రైతులు మరణించగా, అనంతరం జరిగిన ఘర్షణలో మరో నలుగురు చనిపోవడం.. దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపింది. దీంతో ఆశిష్ మిశ్రా సహా పలువురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇదీ చూడండి:లఖింపుర్ ఖేరి ఘటనలో ఇద్దరు నిందితుల అరెస్ట్