ఉత్తర్ప్రదేశ్ లఖింపుర్ ఖేరి ఘటన(Lakhimpur Kheri incident).. అన్నదాతలకు వ్యతిరేకంగా చేపట్టిన ముందస్తు ప్రణాళికలో భాగమేనని రైతు నాయకులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా, ఆయన కుమారుడు ఆశిష్ మిశ్రాను (Ajay Mishra Teni son) అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
సాగు చట్టాలపై నిరసన చేస్తున్న రైతులకు వ్యతిరేకంగా కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుట్ర పన్నారని సంయుక్త కిసాన్ మోర్చా (Samyukta Kisan Morcha) నేత యోగేందర్ యాదవ్ ఆరోపణలు చేశారు. అజయ్ మిశ్రాను మంత్రి పదవి నుంచి తప్పించాలని అన్నారు. కేసులో (Lakhimpur Kheri case) నిందితులను కాపాడేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
ఈ సందర్భంగా తమ తదుపరి కార్యాచరణను ప్రకటించారు యోగేందర్ యాదవ్. దసరా సందర్భంగా (అక్టోబర్ 15న) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా దిష్టిబొమ్మలను దహనం చేస్తామని చెప్పారు. లఖింపుర్ ఘటనకు వ్యతిరేకంగా అక్టోబర్ 18న రైల్ రోకో కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు.
రైతుల పట్ల ప్రభుత్వం హింసాత్మక ధోరణిని అవలంబిస్తోందని మరో నేత జోగిందర్ సింగ్ ఉగ్రాహన్ అన్నారు. కానీ, తాము హింసా మార్గంలో నడవబోమని స్పష్టం చేశారు.
మరోవైపు, లఖింపుర్ ఘటనలో భాజపా కార్యకర్తలను చంపినవారిని దోషులుగా చూడొద్దని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ టికాయిత్ అన్నారు. నిరసనకారులపైకి కారు దూసుకెళ్లడం వల్ల.. వారు ప్రతిస్పందించారని చెప్పారు. ఇది వారి చర్యకు.. ప్రతిచర్య మాత్రమేనని చెప్పుకొచ్చారు.