ఉత్తర్ప్రదేశ్ లఖింపుర్ ఖేరి(lakhimpur kheri incident) హింసాత్మక ఘటనపై రాజకీయ రగడ కొనసాగుతున్న తరుణంలో యోగి ఆదిత్యానాథ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆదివారం జరిగిన ఈ హింసాత్మక ఘటనపై(lakhimpur kheri incident) విచారణ జరిపేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది.
ఆరుగురు సభ్యులతో ఉన్న ఈ బృందానికి అదనపు ఎస్పీ అరుణ్ కుమార్ నేతృత్వం వహించనున్నారు. డిప్యూటీ ఎస్పీ సందీప్ సింగ్ మరో ముగ్గురు ఇన్స్పెక్టర్లు సభ్యులుగా ఉన్నారు.
మళ్లీ పోస్టుమార్టం..
లఖింపుర్లో హింసాత్మక ఘటనలో(Lakhimpur violence news) మృతి చెందిన రైతు గుర్విందర్ సింగ్ మృతదేహానికి అధికారులు బుధవారం మరోసారి పోస్టుమార్టం నిర్వహించారు. ఈ మేరకు బహ్రాయిచ్ జిల్లా కలెక్టర్ దినేశ్ చంద్ర తెలిపారు.
"పోస్టుమార్టం పర్యవేక్షించేందుకు లఖ్నవూ నుంచి వైద్య నిపుణుల బృందం వచ్చింది. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాలకు అనుగుణంగా పోస్టుమార్టం ప్రక్రియను రికార్డు చేశారు. వైద్యుల బృందం పోస్టుమార్టం నివేదికను అందజేస్తుంది. బాధిత కుటుంబ అభ్యర్థన మేరకు పోస్టుమార్టంను మళ్లీ నిర్వహించాం"అని దినేశ్ చంద్ర పేర్కొన్నారు.
అంతకుముందు.. గాయాల కారణంగానే నలుగురు రైతులు మృతిచెందినట్టు పోస్టుమార్టం నివేదిక పేర్కొనడంపై బాధిత కుటుంబ సభ్యులు అభ్యంతరం తెలిపారు. తూటాల కారణంగానే గాయపడి మరణించారని, మరోసారి పోస్టుమార్టం నిర్వహించాలని పట్టుబట్టారు. దీంతో గుర్విందర్ సింగ్(22) మృతదేహానికి బుధవారం మరోసారి పోస్టుమార్టం నిర్వహించేందుకు అధికారులు అంగీకరించారు.
"ఇప్పుడు మాకు ఏ సమస్య లేదు. లఖ్నవూ నుంచి వచ్చిన బృందం పోస్టుమార్టం నిర్వహించేందుకు వచ్చింది. ఆ బృందం ఇచ్చిన నివేదికను మేం అంగీకరిస్తాం." అని గుర్విందర్ సింగ్ కుటుబం సభ్యుల్లో ఒకరు తెలిపారు. గుర్విందర్ సింగ్ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించినట్లు చెప్పారు.
ఇదీ జరిగింది..
ఉత్తర్ప్రదేశ్ లఖింపుర్ ఖేరీలో(lakhimpur kheri incident) ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య పర్యటన నేపథ్యంలో ఆదివారం ఆ ప్రాంతంలో హింస చెలరేగింది. లఖింపుర్ ఖేరీ జిల్లా టికునియా-బన్బీర్పుర్ సరిహద్దు వద్ద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తున్న రైతులు, అధికార వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది.తమపై మంత్రుల కాన్వాయ్ దూసుకెళ్లిందని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనలో నలుగురు రైతులు సహా 8 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇవీ చూడండి: