BJP won in Unnao:దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రెండు ఘటనలకు నెలవైన ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖింపుర్ ఖేరి, ఉన్నావ్‌లో భాజపానే సత్తా చాటింది. లఖింపుర్ ఖేరి జిల్లాలో ఎనిమిది నియోజకవర్గాలు ఉండగా.. అన్నింటిలో భాజపానే విజయం సాధించింది.
హింసాత్మక ఘటన జరిగిన నిఘాసన్ అసెంబ్లీ నియోజకవర్గంలో భాజపా సిట్టింగ్ ఎమ్మెల్యే శశాంక్ వర్మ ఘన విజయం సాధించారు. 41,009 వేలకు పైగా ఓట్ల తేడాతో ఎస్పీ అభ్యర్థిపై గెలుపొందారు. మహమ్మది స్థానంలో తప్ప మిగతా అన్ని చోట్ల భాజపా.. విపక్ష అభ్యర్థులతో పోలిస్తే స్పష్టమైన ఆధిక్యం కనబర్చింది.
Lakhimpur Kheri election result:
ఎన్నికల సమయంలో లఖింపుర్ ఖేరి ఘటనను విపక్షాలు ప్రచారాస్త్రంగా మలుచుకొని భాజపాపై ఎదురుదాడికి దిగాయి. ప్రచారంలో ఈ ఘటనను ప్రస్తావిస్తూ.. ఓట్ల కోసం అభ్యర్థించాయి.
జిల్లాలోని టికూనియా ప్రాంతంలో గతేడాది అక్టోబర్ 3న ఈ అమానుష ఘటన జరిగింది. నిరసన చేస్తున్న రైతులపైకి కేంద్ర మంత్రి అజయ్ మిశ్ర కుమారుడి కారు దూసుకెళ్లింది. దీంతో నలుగురు రైతులు సహా ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. దీనిపై దేశవ్యాప్తంగా ఆగ్రహజ్వాలలు వ్యక్తమయ్యాయి. ఘటనకు సంబంధించిన వీడియో సైతం విస్తృతంగా వైరల్ అయింది.