Lady Constable Suicide :ఆత్మహత్య చేసుకుని చనిపోయిన ఓ మహిళా కానిస్టేబుల్ మృతదేహంపై 500పైగా గాయాల మరకలు కనిపించడం కలకలం రేపింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. కానిస్టేబుల్ ఆత్మహత్యకు దారితీసిన కారణాలు, ఆమె శరీరంపై ఆ గాయాలు ఎలా వచ్చాయన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఉన్నావ్.. పోలీస్ లైన్‌లోని హాస్టల్లో నివాసం ఉంటున్న మీను అనే మహిళా కానిస్టేబుల్.. గురువారం తన గదిలోని ఫ్యాన్‌కు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో ప్రాణాలు కోల్పోయింది. అనంతరం ఆమె మృతదేహానికి శవ పరీక్షలు నిర్వహించారు. ఆ నివేదికలో మహిళా కానిస్టేబుల్ ఉరివేసుకుని చనిపోయినట్లు వెల్లడైంది. అయితే మీను మృతదేహాంపై 500పైగా గాయాల మరకలు ఉన్నట్లు వెల్లడైంది.
అయితే, చనిపోయిన మహిళా కానిస్టేబుల్ అలీగఢ్‌కు చెందిన ఓ కానిస్టేబుల్‌తో ప్రేమలో ఉన్నట్లు స్థానికులు చెప్పారు. అతడు మీనును మోసం చేసి వేరే చోట పెళ్లి చేసుకున్నాడని.. బాధితురాలు ఎన్నిసార్లు ఫోన్‌చేసినా సమాధానం ఇవ్వలేదని తెలుస్తోంది. దీంతో మీను తీవ్ర మనస్తాపానికి గురై.. తనకు తాను గాయపరచుకుని ఆత్మహత్య చేసుకుని ఉంటుందని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. విచారణలో ఎవరు తప్పు చేసినట్లు తేలినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అయితే మృతురాలి కుటుంబ సభ్యులు ఈ ఘటనపై మాట్లాడటానికి ఇష్టపడలేదు.
స్విస్ మహిళ హత్య.. నిందితుడు అరెస్ట్..
స్విట్జర్లాండ్‌కు చెందిన ఓ మహిళను హత్య చేసిన ఘటనలో గుర్ప్రీత్ అనే నిందితుడిని అరెస్టు చేసినట్లు దిల్లీ పోలీసులు శనివారం తెలిపారు. ఈ సందర్భంగా కేసు వివరాలను వెల్లడించారు. 'నాలుగేళ్ల క్రితం బాధితురాలు, గురుప్రీత్‌కు సోషల్ మీడియాలో పరిచయం ఏర్పడి స్నేహంగా మారింది. అయితే బాధితురాలిని కలవాలని నిందితుడు స్విట్జర్లాండ్ నుంచి ఇండియాకు రప్పించాడు. అనంతరం గొలుసులతో ఆమె కాళ్లు, చేతులు కట్టిపడేశాడు. పది నిమిషాల్లో సర్ప్రైజ్ ఇస్తానని గొంతు కోసి చంపేశాడు. ఆ తర్వాత కారులో మృతదేహాన్ని దిల్లీలోని తిలక్ నగర్ ప్రాంతంలో పడేశాడు' అని పోలీసులు తెలిపారు.